మావోయిస్టు పరిచయం.. పోలీసు పెళ్లి! అతడు ఒకనాటి మావోయిస్టు……

10brk-maoistజగ్దల్‌పూర్‌: అతడు ఒకనాటి మావోయిస్టు. మారిపోయి సాధారణ జనజీవనంలోకి అడుగుపెట్టడమే గాక.. పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆమె కూడా మావోయిస్టే. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయింది. వీరిద్దరూ మావోయిస్టు శిక్షణలో కలుసుకున్నారు. నేడు పోలీసులుగా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌లో జరిగిన ఈ వివాహం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

సుక్మా జిల్లా బెంగ్పాల్‌ గ్రామానికి చెందిన మావోయిస్టు పద్మిని ఇటీవల పోలీసులకు లొంగిపోయింది. ఆమెతో పాటు భద్రమ్‌, లచ్‌మతి అనే మరో జంట కూడా లొంగిపోయారు. దీంతో వీరి వివాహాలను పోలీసులు మంగళవారం జరిపించారు. పోలీసులకు లొంగిపోయిన పద్మిని.. జగ్దల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మన్సాయ్‌ను వివాహమాడింది. మన్సాయ్‌ కూడా ఒకప్పుడు మావోయిస్టుగా పనిచేశాడు. నక్సల్‌ శిక్షణ పొందిన సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి.. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

మరో లొంగిపోయిన జంట భద్రమ్‌-లచ్‌మతి పోలీసుల సమక్షంలో పెళ్లిచేసుకున్నారు. గ్రామస్థులంతా కలిసి సంప్రదాయ బద్ధంగా వివాహతంతు జరిపించారు. జగ్దల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌, బస్తర్‌ రేంజ్‌ ఐజీ, కమిషనర్‌, ఎస్పీ తదితర ఉన్నతాధికారులు ఈ వివాహాలకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా సాగుతుంటాయి. దీంతో వారిని మార్చి… సాధారణ జనజీవన స్రవంతిలో కలిపేందుకు అక్కడి పోలీసులు తరచుగా అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అందులో భాగంగానే లొంగిపోయిన మావోయిస్టులకు దగ్గరుండి ఇలా పెళ్లిళ్లు జరిపిస్తున్నారు.