మావోలకు ఎదురుదెబ్బ

– మావోలతో సంబంధాలున్న నలుగురి అరెస్ట్‌
– మౌలాలీలోని ఓఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు
– మావో కీలక నేత ఆర్కేతో కలిసి పనిచేసినట్లు గుర్తింపు
హైదరాబాద్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీతో సంబంధాలు ఉన్న నలుగురు సభ్యులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ అయ్యారు. ఈ నలుగురు నగరంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో.. మౌలాలీ ప్రాంతంలోని ఓ ఇంట్లో విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిని అనూష, అన్నపూర్ణ, భవానీ, కామేశ్వరరావులుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అరెస్టైన నలుగురు 2017 ఉంచి మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగుతున్నారని పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కేను అనూష, అన్నపూర్ణలు కలిశారని, తర్వాత కొద్ది రోజులకు వారి సోదరి అనూష కూడా దళంలో చేరిందని సమాచారం. పోలీసులపై దాడి చేసిన మూడు ఘటనల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అనూష మావోయిస్టు పార్టీలో కీలక నేత ఆర్కేకు గన్‌మెన్‌గా పనిచేశారని పోలీసులు పేర్కొనంటున్నారు. సిక్కవరప్పాడు, జుడోకో గ్రామంలో పోలీసులపై కాల్పులు,  2018 నవంబర్‌లో ఆర్కే ఆదేశాలతో పోలీసులపై మందుపాతర పేల్చిన ఘటనలో అనూష పాల్గొనట్లు గుర్తించారు. ఈమె తండ్రి రమణయ్య కుల నిర్మూలన పోరాట సమితితో పనిచేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదివరకే వీరిపై పాడేరు పోలీస్‌ స్టేషన్‌లో పలుకేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. వారితో పాటు కుర్రా కామేశ్వరరావు అనే యువకుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కిడారి హత్యకేసులో ఉంది వీరేనా..?
విశాఖలో సంచలనం రేపిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము ఎన్‌కౌంటర్‌లో వీరి పాత్ర కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం రావాల్సిఉంది. మావోయిస్టు కీలక నేత రామక్రిష్ణ (ఆర్‌కే) ఆధ్వర్యంలో పలు ఎన్‌కౌంటర్లలలో వీరు ప్రత్యక్ష్యంగా పాల్గొన్నారని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టయిన వారిలో అనుషా దళకమాండర్‌గా పలు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నగరంలో ముగ్గురు మావోయిస్టులు పట్టుపడటం సంచలనంగా మాదిన నేపథ్యంలో పోలీస్‌ శాఖ అలర్టయింది.