మా ఉద్యమం ఆగిపోలేదు శ్రీఅవినీతి రహిత దేశమే మా లక్ష్యం అన్నా హజారే

న్యూఢిల్లీ, నవంబర్‌ 10 (జనంసాక్షి):
అవినీతికి వ్యతిరేకంగా మా ఉద్యమం ఆగిపోలేదు.త్వరలో ప్రధాన శక్తిగా అవతరిస్తాం. అవినీతి రహిత భారత దేశమే మా లక్ష్యం అని స్వతంత్య్ర సమరయోధుడు అన్నా హజారే అన్నారు. 13 మంది సభ్యులతో ఆయన కొత్త బృందాన్ని ఏర్పాటు  చేసి ప్రకటించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఉద్యమం అంతరించిపో యిందని కొన్ని స్వార్థపరశక్తులు దుష్పచారం చేస్తున్నాయని అన్నా ఆక్షేపించారు. అది నిజం కాదని, తమ ఉద్యమం మళ్లీ  ఊపిరిపోసుకుని ఉవ్వెత్తున ఎగుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. 2014 కల్లా మహా ఉద్యమం నిర్మిస్తామని, అప్పుడు  తమ ఉద్యమాన్ని ప్రభుత్వం ఉపేక్షించజాలదని ఆయన చెప్పారు. ఉద్యమానికి కొత్త ఊపిరి ఊదడం కోసం మార్గదర్శనం చేయడం కోసం 13 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని అన్నా ఏర్పాటు చేశామని చెప్పారు.  ఈ కమిటీ కార్యక్రమం జనవరి 30వ తేదీన ప్రారంభవుతుందని ఆయన వెల్లడించారు.  ఢిల్లీలో మరో 15 రోజులలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తాము చెబుతున్న జనలోపాల్‌  బిల్లు ప్రభుత్వం చెబుతున్న బిల్లులా శక్తి హీనమైంది కాదని  సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. భవిష్యత్తు కార్యాచరణను  రూపొందిం చుకోవడానికి వీలుగా శనివారం నాడు భావసారూప్యంగల వ్యక్తులతో చర్చించామని ఆయన వెల్లడించారు. వ్యవస్థల్లో సమూల మార్పులకోసం కృషి చేసే ప్రతి ఒక్కరికీ ఇదే తమ ఆహ్వానం అని అన్నా పిలుపు ఇచ్చారు. విదేశీ  కంపెనీలు మనగడ్డపై వ్యాపారం చేయడాన్ని అనుమతించేది లేదని ఆయన చెప్పారు. ప్రకృతి అందించిన అపారమైన సహజ వనరులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు అని ఆయన చెప్పారు. ఎక్కడెక్కడి నుంచి ప్రజలు వచ్చి తమ ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నార ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనప్పుడు ప్రజలకు అటువంటివారిని వెనుకకు పిలిపించే హక్కు ఉంటుందని, దాన్ని తాము సాధిస్తామని ఆయన చెప్పారు. దేశంలో అవినీతి పెరిగిపోతున్నదని మాట్లాడడం సరిపోదని, అందరూ ఏక ఛత్రం క్రిందికి వచ్చి ఉద్యమించాలని ఆయన చెప్పారు. గ్రామాలలో భూమి సేకరణ కార్యక్రమం స్థానికంగా గ్రామసభలే నిర్వహిస్తాయని ఇందులో ప్రభుత్వం పాత్ర లేదని ఆయన చెప్పారు. ప్రజల భాష ప్రభుత్వానికి అర్థం కాకపోతే ప్రభుత్వానికి అర్థమయ్యే భాషలోనే చెప్పవలసి ఉంటుందని ఆ పని ప్రారంభిస్తామని అన్నా ఉద్ఘాటించారు. ఇక తమ ఉద్యమం నాలుగు దశలలో ఉంటుందని అది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయి, పంచాయతీ స్థాయిల అని ఆయన వెల్లడించారు. మహిళలు, దళితులు, ముల్లింలు అందరూ ఒకే గొడుగు కిందికి రావాలని అన్నా పిలుపునిచ్చారు.