మా ఊర్లోకి బస్సురాకున్నా.. మునుగోడులో నేతల ముమ్మర ప్రచారం
కోనాపూర్ సర్పంచ్ క్యామ పరుశరాములు
జనం సాక్షి,వంగూర్:
స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో పాటు నేతలు కూడా విఫలమయ్యారని వంగూరు మండలంలోని కోనాపూర్ గ్రామ సర్పంచ్ క్యామ పరుశ రాములు మంగళవారం ఆరోపించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉల్పర వద్ద ఉన్న దుందుభినది ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిలిపివేశారు. దీంతో ఉల్పర, కోనాపూర్, రంగాపూర్, మిట్టసదగోడు గ్రామాలకు చెందిన ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉల్పర గ్రామానికి చెందిన విద్యార్థులైతే పాఠశాల, కళాశాలలు మానేసుకొని ఇంటి వద్ద ఉంటున్నారు. మిగతా గ్రామాల ప్రజలకు కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఆయా గ్రామాల నుండి నడిపించాలని ఆయన కోరారు. స్థానికంగా ఉన్న చిన్న సమస్యను పరిష్కరించలేని మండల నేతలు మునుగోడులో ఎన్నికలలో ముమ్మర ప్రచారంలో మునిగిపోయారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఆయా గ్రామాల ప్రజలు అధికారులపై నేతలపై తిరగబడక ముందే సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
Attachments area