మా గోడు వినండి… మా గొంతు తడపండి

3

– మంచినీళ్లో.. రామచంద్ర

– కోకకోలా కంపెనీ మా కొంపముంచింది

– మోదీ నియోజకవర్గం వారణాసిలో జనం ఆందోళన

న్యూఢిల్లీ నవంబర్‌28(జనంసాక్షి): మాగోడు వినండి మాగొంతు తడపండి అంటూ మంచినీళ్లో రామ చంద్రా అంటూ  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజలు మంచినీళ్ల కోసం ఆందోళనకు దిగారు.  స్థానికంగా ఏర్పాటు చేసిన కోకా కోలా బాట్లింగ్‌ కంపెనీ మూలంగానే తమకు  తాగునీటి కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.  ఉత్తరప్రదేశ్‌ లని వారణాసి నియోజకవర్గం  మెహ్దీతంజ్‌  మండలంలోని సుమారు 18  గ్రామ పంచాయితీలు ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టాయి.  1991లో  ఇక్కడ నెలకొల్పిన కోకా కోలా కంపెనీ  ప్లాంట్‌ మూలంగానే తమకు మంచినీళ్ల కరువు వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.   సదరు కంపెనీ భూగర్భజలాలు  విపరీతంగా  తోడేస్తూ  ఉండడం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. క్రమక్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, అందుకే ఇక్కడినుంచి ఆ కోకా కోలా  బాట్లింగ్‌ ప్లాంట్‌ ను  ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

గ్రామస్తులు ఆందోళనకు అధికారులు సహా, కాలిఫోర్నియా కు చెందిన భారతీయ స్వచ్ఛంద సంస్థ మద్దుతుగా నిలిచింది. ఇక్కడి నీటివనరులను కోకా కోలా కంపెనీ కొల్లగొడుతోందని, దీని మూలంగా తమ గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, రైతులు ఇబ్బందులనెదుర్కోవాల్సి వస్తోందని సంస్థ  ప్రతినిది అమిత్‌ శ్రీ వాస్తవ  వాదిస్తున్నారు. దీనిపై కోకా కోలా కంపెనీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేశామన్నారు.

అయితే వీరి ఆరోపణలను  కోకా కోలా కంపెనీ ఖండిస్తోంది. నీటి సమస్యకు  తమ సంస్థ కారణం కానే కాదని  వాదిస్తోంది.  ఇక్కడి గ్రామాల్లోని నీటివనరుల పరిమితి క్రమేపీ క్షీణిస్తున్న మాట వాస్తవమేనని   సెంట్రల్‌  గ్రౌండ్‌ వాటర్‌  బోర్డ్‌ సమర్పించిన  ఇటీవలి నివేదిక చెబుతోంది.  అయినప్పటికీ స్థానికంగా ఉన్న బోర్లు, బావులలో గృహ వినియోగానికి, గోధుమ, ఆవ తదితర పంటల అవసరాలకు సరిపడేంతగా ఉన్నాయని కూడా పేర్కొంది.