మా పనితీరుకు ‘ఉప’ తీర్పు
– మంత్రి కేటీఆర్
వరంగల్ నవంబర్ 1 (జనంసాక్షి): వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం తెరాస ప్రభుత్వ పని తీరుకు తీర్పుగా భావించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం హన్మకొండలోని శ్యామల గార్డెన్స్‌లో వరంగల్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గత వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసకు వచ్చిన మెజారిటీలో ఇప్పుడు ఒక్క ఓటు తగ్గినా తెరాస పని తీరు బాగాలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయన్నారు. భారీ మెజారిటీ కోసం కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, తెరాస జిల్లా, అర్బన్ అధ్యక్షుడు రవీందరరావు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.