మా సర్కారుపై ప్రజల్లో ఆశలు పెరిగాయి

5

– ప్రధాని మోదీ

న్యూదిల్లీ,మే28(జనంసాక్షి): ప్రభుత్వంపై ప్రజల ఆశలు పెరిగాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తౌెన సందర్భంగా ఇండియా గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆయన తెలిపారు. గతంలో ఏం జరిగిందీ.. ప్రస్తుతం ఏం జరుగుతోందన్న అంశాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని మోదీ అన్నారు. మనం చేసిన పనులను మూల్యాంకనం చేసుకోవాలని సూచించారు.

మోదీ పాలన రెండేళ్ళ పండుగ!

మోదీ రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న వేడుకలతో ఇండియా గేట్‌ ప్రాంతం సందడిగా మారింది. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలనే ఇతివృత్తంగా కొనసాగిన ‘మేరా దేశ్‌ బఢ్‌ రహా హై… ఆగే బఢ్‌ రహా హై…’ అంటూ సాగిన గీతం ఆహూతులను అలరించింది. ‘ఏక్‌ నయీ సుబహ్‌’  పేరిట నిర్వహిస్తున్న ఐదు గంటల సుదీర్ఘ మెగా ఈవెంట్‌ లో భాగంగా ఎన్గీఏ పాలనలోని విజయాలు, పథకాలను కేంద్రం వివరిస్తుంది.ఢిల్లీలోని ఇండియా గేట్‌ ప్రాంతం కార్యకర్తలు, అభిమానులు, ప్రేక్షకులతో కోలాహలంగా మారింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఏక్‌ నయీ సుబహ్‌’ కార్యక్రమాలు మనోరంజకంగా కొనసాగుతున్నాయి. ఐదు గంటలపాటు ఏకథాటిగా కొనసాగే కార్యక్రమానికి బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌ ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన బేటీ బచావో, బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలపై చిన్నారులతో ముచ్చటించారు.ఐదు గంటలపాటు జరిగే  విజయోత్సవ కార్యక్రమాన్ని మొత్తం పది సెగ్మెంట్లుగా విభజించారు. వీటిలో రెండేళ్ళ పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, నెరవేర్చిన హావిూలు, పలు పథకాలపై చర్చించేందుకు కేటాయించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు, వారితో జరిపిన ఇంటర్వ్యూలు, పథకాలవల్ల లబ్ధిపొందినవారితో చర్చలు వంటి అనేక కార్యక్రమాలను వీడియోల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రాజధాని ఢిల్లీకి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం కాక, దేశంలో కేంద్ర మంత్రులు ఉన్న షిల్లాంగ్‌, ముంబై, విజయవాడ, జైపూర్‌, కర్నాల్‌, అహ్మదాబాద్‌ నగరాల్లో వారు చేపట్టిన కార్యక్రమాలపై దూరదర్శన్‌ ప్రత్యేక లైవ్‌ కార్యక్రమం కూడ నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్‌ లోని మంత్రులు, పలువురు సినీ తారలు, హాజరయ్యారు.