మిత్రపక్షాల విలువ వాళ్లకు ఇప్పుడు తెలిసింది

పుట్టగతులుండవనే నష్టనివారణ చర్యలు చేపట్టారు

ఏపీ మంత్రి యనమల

అమరావతి,జూన్‌6(జ‌నం సాక్షి): మిత్రపక్షాలకు ద్రోహం చేసిన మోదీ, అమిత్‌షా ఇప్పుడు మళ్లీ వాళ్ల చుట్టూ తిరుగుతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చాక మిత్రపక్షాల విలువ తెలిసిందన్నారు. ఇక పుట్టగతులు ఉండవనే నష్ట నివారణ చర్యలు చేపట్టారని వ్యాఖ్యానించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని యనమల అన్నారు. అమిత్‌ షా, మోదీ అహంభావంతో ఆడ్వాణీని అవమానించారని, మురళీ మనోహర్‌ జోషిని అగౌరవపరిచారని తెలిపారు. ఆడ్వాణీ, జోషి ఇళ్లకు వెళ్లడం…శివసేన, అకాలీదళ్‌ చుట్టూ ప్రదక్షిణలు చేయడం…దేశంలో బీజేపీ ప్రస్తుత దుస్థితికి నిదర్శనమని యనమల పేర్కొన్నారు.లౌకికవాదం ఎంత ప్రమాదంలో ఉందో బిషప్‌లే చెప్పారన్నారు. ఈవీఎంల ద్వారా ప్రజాతీర్పును కాలయాలని చూశారన్నారు. కైరానా ఎంపీ స్థానం ఉపఎన్నిక ఫలితమే దానిని ఎండగట్టిందని చెప్పారు. ప్రజలకే కాదు భాగస్వామ్య పక్షాలకూ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. స్వయంకృతాపరాధం వల్లే బీజేపీ ఒంటరిగా మిగిలిందని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.