మిషన్ కాకతీయకు సర్వత్రా ప్రశంసలు
చిన్ననీటి పారుదల రంగాన్ని అద్భుతం చేసి చూపుతాం: హరీష్ రావు
మెదక్,ఏప్రిల్7(జనంసాక్షి): మిషన్ కాకతీయకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. దీంతో చిన్ననీటి పారుదల రంగం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని అన్నారు. మిషన్ కాకతీయ పథకంపై ఆయన మాట్లాడుతూ.. చెరువుల మరమ్మతు గురించి గత పాలకులు పట్టించుకోలేదన్నారు. అందువల్లనే చెరువులన్నీ చెత్తకుప్పలకు నిలయాలయ్యాయని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్న తీరు వల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధిస్తామని అన్నారు. కేంద్రమంత్రి ఉమాభారతి పథకాన్ని ప్రశంసించారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఆయన పలు చోట్ల చెరువుల పునరుద్దరణ పనలుల్లో పాల్గొన్నారు. భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ తొలివిడత విజయవంతమైందని, రెండో విడతనూ విజయవంతం చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వతమైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపడుతుంటే, ఓర్వలేక రాజకీయ మనుగడకోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నీటిపారుదల ప్రాజెక్టులపై అర్థరహిత ఆరోపణలతో అప్రతిష్టపాల్జేసి అభివృద్ధికి ఆటంకం కలిగించాలనే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. ప్రాణహిత-చేవెళ్ల ఆలోచన లేని ప్రాజెక్టని, కాంగ్రెస్ హయాంలో వేల కోట్లు ఖర్చుచేసి, ఎకరానికి కూడా నీరందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన పనిలేదని, ప్రాణహిత ప్రజాహితం కాదని స్పష్టంగా కనబడుతున్నదన్నారు. అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నీటిలభ్యత ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణానికి రీడిజైన్ చేస్తున్నదన్నారు. లక్ష కోట్లు వ్యయం చేసి తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. కరెంటు, సాగు, తాగునీరు, ఇండ్లు అడుక్కునే స్థితిలో తెలంగాణ ఉండొద్దన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు.ఇంటింటికీ తాగునీరిచ్చే మిషన్ భగీరథకు ప్రపంచ గుర్తింపు, ప్రశంసలు వస్తున్నాయన్నారు. పలురాష్టాల్ర ప్రతినిధులు, సీఎంలు దీని గురించి తెలుసు కుంటున్నారన్నారు. గోదావరి జలాలతో బీళ్లను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం తపిస్తున్నదన్నారు. గోదావరిపై కాళేశ్వరం నుంచి బాసర వరకు ఆరు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామన్నారు. మూడేండ్లలో 24 గంటలపాటు సాగుకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ప్రజల కన్నీరు తుడిచేంత వరకు ప్రభుత్వం నిద్రపోదన్నారు.