మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ
సంగారెడ్డి,ఏప్రిల్17(జనంసాక్షి): రాష్ట్రంలో కరువును పారదోలి చెరువుల్లో జలకళను సంతరించేందుకు ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకం ప్రవేశపెట్టి చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రాష్టాన్న్రి బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తుందన్నారు. ఆనవాళ్లు కోల్పోయిన చెరువులను కోట్లాది రూపాయలు వెచ్చించి చెరువుల పునరుద్ధరణకు ఓ మహత్తర కార్యక్రమాన్ని తీసుకవచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని కొనియాడారు. మిషన్ కాకతీయ పథకంలో నాణ్యమైన పనులు చేపట్టేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. నాలుగవ విడత 19 చెరువులకు సుమారు రూ.2.17 కోట్లతో మిషన్‌కాకతీయ చెరువుపునరుద్ధరణ పనులకు
నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. అనేక గ్రామాల్లో నాలుగవ విడత మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ముఖ్యమంతి కేసీఆర్ రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. సీఎం చేపడుతున్న సంక్షేమ పథకాలు యావత్‌దేశాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. వివిధ సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే ప్రజాసంక్షేమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. వచ్చే వానాకాలం నాటికి పెద్దశంకరంపేట మండలంలోని చెరువులు, కుంటలకు మల్లన్నసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందనిఅన్నారు. మల్లన్నసాగర్ ద్వారా ప్రస్తుత వానాకాలం సీజన్‌కు నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీరు నింపుతామని, దీంతో పెద్దశంకరంపేట మండలంలోని సంగారెడ్డిపేట, జూకల్, వీరోజిపల్లి, కొత్తపేట, నారాయణపల్లి, చీలపల్లి, జంబికుంట, తదితర గ్రామాలకు బ్యాక్ వాటర్ ద్వారా సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.