మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్దరలో ముందంజ

పినపాకలో వందలాది ఆయకట్టు స్థిరీకరణ: పాయం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో మిషన్‌కాకతీయ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరించడంలో పినపాక నియోజకవర్గం ముందువరుసలో ఉందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మిషన్‌కాకతీయ చెరువుల అభివృద్ధిలో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మంజిల్లా ముందుందని అందులో పినపాక నియోజకవర్గం ముందువరుసలో ఉందన్నారు. వరుసగా 4విడతల్లో చెరువుల పునరుద్ధరణకు అహర్నిశలు శ్రమించిన ఇరిగేషన్‌ అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కొత్త చెరువుల నిర్మాణానికి, 5వ విడత మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు. ప్రతి పల్లె సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వ చెరువుల పునరుద్దరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఆయకట్టు రైతుల్లో ఆనందం నింపిందని అన్నారు. ఇప్పటికే 4విడతలుగా 394చెరువులను అభివృద్ధిచేయడం జరిగిందన్నారు. ఈ చెరువుల కింద 36,846ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 816చెరువులు ఉండగా నాలుగు విడతలలో 437చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.112కోట్ల 79లక్షల నిధులను మంజూరుచేసిందని తెలిపారు. పులుసుబొంత ప్రాజెక్టు నిర్మాణానికి క్లీయరెన్స్‌ వచ్చిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 10వేల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరందుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో పినపాక, కరకగూడెం, గుండాల మండలాలతోపాటు జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లాలోని తాడ్వాయి మండలాలకు లబ్ధిచేకూరుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.123కోట్లు ఖర్చవుతుందని త్వరలోనే నిధులు మంజూరుకానున్నాయన్నారు. కరకగూడెం మండలంలో గొడుగుబండ గ్రామం వద్ద వట్టివాగు చెరువు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు.