మిషన్‌ భగీరథతోపాటే సైబర్‌ గ్రిడ్‌

5

– మంత్రి కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి):ఇంటింటికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చే తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌, సాఫ్ట్‌ నెట్‌ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ సవిూక్ష జరిపారు. ఫైబర్‌ గ్రిడ్‌ పనులు జరుగుతున్న తీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్‌.డబ్ల్యు.ఎస్‌ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మిషన్‌ భగీరథ పనులతో సమన్వయంగా జరుగుతున్న విధానాన్ని సవిూక్షించారు. ఆగస్టు రెండో తేదీన అన్ని మిషన్‌ భగీరథ వర్కింగ్‌ ఏజెన్సీలతో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో మిషన్‌ భగీరథ పనులతో పాటు ఫైబర్‌ గ్రిడ్‌ పనులను సమాంతరంగా చేయాలని మంత్రి కోరనున్నారు.ఫైబర్‌ గ్రిడ్‌ లో ఉపయోగించే పరికరాలను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఐటి శాఖ ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి పరికరాల గురించి వివరించారు. మిషన్‌ భగీరథ పైపులైన్లో వేసే మేజర్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ వైర్లతో గ్రామాల్లో ఇంటింటికి కనెక్షన్‌ ఇచ్చే వైర్లను, వాటి వివరాలను మంత్రికి తెలిపారు. ఇప్పటికే ఫైబర్‌ గ్రిడ్‌ పైన అనేక కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయని, ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రతి ఒక్కరికి డిజిటల్‌ ప్రపంచ ప్రయోజనాలు అందుతాయన్నారు మంత్రి కేటీఆర్‌.సాఫ్ట్‌ నెట్‌ సీఈవో శైలేష్‌ రెడ్డి మన టీవీపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సాఫ్ట్‌ నెట్‌ పేరు మార్చాలని, త్వరలోనే పున:ప్రారంభానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. గతంలో చెప్పిన తీరుగా ఈ చానల్‌ తో యువతకు, విద్యార్థులకు, రైతులకు, గృహిణులకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలను తయారు చేసుకోవాలని సూచించారు. టాస్క్‌, టి హబ్‌ లాగానే సాఫ్ట్‌ నెట్‌ కు పూర్తిస్థాయిలో శాఖ పరమైన సహకారం అందించేలా చూస్తామని మంత్రి తెలిపారు.టిఎస్‌ఐఐసి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తోపాటు ఐటి శాఖ ఉన్నతాధికారులు, సాఫ్ట్‌ నెట్‌, ఫైబర్‌ గ్రిడ్‌ అధికారులు పాల్గొన్నారు.