మిషన్‌ భగీరథ అద్భుత పథకం

– ఇంటింటికి సురక్షిత నీరివ్వాలనే ప్రభుత్వ లక్ష్యం గొప్పది
– కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ నారాయణ్‌ ఝూ
– గజ్వేల్‌ మండలంలో మిషన్‌ భగీరథ పంప్‌హౌజ్‌ను సందర్శించిన కేంద్ర బృందం
సిద్ధిపేట, జూన్‌29(జనం సాక్షి) : మిషన్‌ భగీరథ పథకం తమని చాలా ప్రభావితం చేసిందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌ నారాయణ్‌ ఝా చెప్పారు. ఇంటింటికీ సురక్షిత తాగునీరు ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చాలా గొప్పదని కొనియాడారు. సిద్దిపేట జిల్లాలో అజయ్‌ తమ బృందంతో పర్యటించారు. గజ్వేల్‌ మండలం కోమటి బండ వద్ద ప్రధాని మోడీ ప్రారంభించిన మిషన్‌ భగీరథ పంప్‌ హౌజ్‌ ను సందర్శించారు. గజ్వేల్‌ లో ఎడ్యుకేషన్‌ హబ్‌, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. మిషన్‌ భగీరథ పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నారని అజయ్‌ నారాయణ్‌ కొనియాడారు. ఇంజినీర్లు బాగా పనిచేసి పథకాన్ని త్వరగా పూర్తి చేశారని ప్రశంసించారు. ప్రభుత్వ యంత్రాంగం బాగా పనిచేస్తున్నదని మెచ్చుకున్నారు. పేదలకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు బాగా నిర్మిస్తున్నారని అన్నారు. ఆ తర్వాత చిన్నకోడూరు మండలం చందులాపూర్‌ వద్ద రంగనాయక సాగర్‌ ప్రాజెక్టును  అజయ్‌ నారాయణ్‌ ఝా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించారు. టన్నెల్‌, పంప్‌ హౌస్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ వివరాలను జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కేంద్ర బృందానికి వివరించారు.