మిసైల్‌ మ్యాన్‌ అబ్దుల్‌కలాంకు ప్రముఖుల ఘననివాళి

168

న్యూఢిల్లీ,అక్టోబర్‌ 15(జనంసాక్షి): భారత మాజీ రాష్ట్రపతి ‘మిస్సైల్‌ మ్యాన్‌’ ఏపీజే అబ్దుల్‌కలాం 85వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆయనకు ట్విట్టర్‌ ద్వారా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడికీ ఆదర్శనీయ వ్యక్తి అబ్దుల్‌ కలాం అంటూ మోదీ కొనియాడారు. 1931 అక్టోబర్‌ 15న తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్‌ కలాం జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయనను ప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌, భారతరత్న వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కరించింది. మంచి వక్తగానే కాక ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’, ‘ఇగ్నైటెడ్‌ మైండ్స్‌’ వంటి పుస్తకాలు రాసి గొప్ప రచియితగానూ పేరుపొందారు. 2015 జులై 27న గుండెపోటుతో కలాం కన్నుమూశారు. కలాం 85వ జయంతి సందర్భంగా ప్రముఖులు, సామాన్యుల నుంచి కూడా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ విూడియా సైట్‌ ట్విట్టర్‌ ద్వారా అందరూ కలాంను స్మరించుకుంటున్నారు. తొలుత శాస్త్రవేత్తగా, ఆ తర్వాత భారత రాష్ట్రపతిగా(2002- 2007) సేవలందించి కలాం దేశప్రజల మన్ననలు పొందారు. ఎయిర్‌స్పేస్‌ ఇంజనీర్‌గా ఇస్రో, డీఆర్‌డీఓలో గొప్ప పరిశోధనలతో, బాలిస్టిక్‌ క్షిపణుల రూపకల్పనలో కలాం చేసిన కృషి దేశం ఎన్నటికీ మరువలేనిది. భారత

రత్న, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలతో పాటు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు పొందారు కలాం. ఆయన 2015 జులై 27న 83వ ఏట విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. ఎందరో ప్రముఖులు ట్వీట్ల ద్వారా నివాళులర్పించారు. నెటిజన్లు కలాం చెప్పిన సూక్తులను, ఆయన స్ఫూర్తిమంతమైన ప్రసంగాలను సోషల్‌విూడియాలో పోస్ట్‌ చేశారు. భరతమాత నిజమైన కుమారుడిని నేడు తప్పక స్మరించుకోవాలని, లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి అంటూ ట్వీట్లు చేశారు.  భారత రత్న అబ్దుల్‌ కలాం స్మారక స్తూపానికి ఆయన స్వగ్రామమైన రామేశ్వరంలో శంకుస్థాపన చేశారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా కలాం సోదరుడు ముత్తువిూరన్‌ మరైకయర్‌ భూమిపూజ చేశారు. రూ.50కోట్ల వ్యయంతో స్మారక స్తూపం, నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మించనున్నారు.

క్రమంలో మొదటి విడతలో భాగంగా రూ.15 కోట్లతో 27వేల చదరపు అడుగుల్లో స్మారక స్తూపం, అబ్దుల్‌ కలాం విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. దీనిని 2017 జులై 27న కలాం వర్ధంతి రోజున ప్రారంభిస్తారు. రెండో విడతలో నాలెడ్జ్‌ సెంటర్‌ నిర్మాణం చేపడతామని డీఆర్‌డీవో అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని అబ్దుల్‌కలాంకు నివాళులర్పించారు.