మీరు నల్లగా ఉన్నా.. తెల్ల అమ్మాయిలు కావాలా!

మీరు నల్లగా ఉన్నా.. తెల్ల అమ్మాయిలు కావాలా!
 న్యూఢిల్లీ : మహిళలపై జేడీ(యూ) ఎంపీ శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో బీమా బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”మీ దేవుడు రవిశంకర ప్రసాద్లా నల్లగా ఉంటారు. కానీ పెళ్లి ప్రకటనల్లో మాత్రం తెల్లటి అమ్మాయిలు కావాలని చెబుతారు” అని శరద్ యాదవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటితో పాటు ఇంతకుముందు శరద్ యాదవ్ దక్షిణాది మహిళల నల్ల రంగు గురించి చేసిన వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. ”వాళ్లు చాలా అందమైన వాళ్లు.. వాళ్లకు డాన్సు చేయడం కూడా వచ్చు” అని గతంలో శరద్ యాదవ్ అన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని రవిశంకర ప్రసాద్ సభలో ప్రస్తావించారు. శరద్ యాదవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు.

దీనిపై శరద్ యాదవ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. దేశంలోను, ప్రపంచంలోను చాలామంది నల్లరంగు మహిళలున్నారని, దీనిపై తాను ఎవరితోనైనా చర్చించగలనని, భారతీయ సంస్కృతిని తాము ఎంతో గౌరవిస్తామని అన్నారు. అయినా అధికారపక్షం మాత్రం పట్టు విడవలేదు. మహిళల రంగు మీద సభ్యులు వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అయితే.. దీనిపై చర్చకు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ నిరాకరించారు.