మీర్ పేటలో లారీ బీభత్సం.
హైదరాబాద్ : నగరంలో లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మొన్న బాలానగర్ లో బ్రేకులు ఫెయిలైన లారీ బీభత్సం సృష్టించిన ఘటన మరిచిపోకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. మీర్ పేట చౌరాస్తాలో నల్గొండ నుండి వస్తున్న లారీ అదుపు తప్పింది. బ్రేకులు ఫేయిల్ కావడంతో ముందు వెళుతున్న బ్రిలియంట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. అతి స్పీడుగా ఢీకొట్టడంతో స్కూల్ బస్సు పక్కకు పడిపోయింది. దీనితో అందులో ఉన్న విద్యార్థుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా లారీ రెండు ద్విచక్రవాహనాలను, ఓ ఆటోను ఢీకొట్టి ఆగిపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీవ్రగాయాలైన చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయకంపితులయ్యారు. తమ చిన్నారులకు ఏమైనా ప్రమాదం జరిగిందా ? అని పరుగు పరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. గాయాలతో చిన్నారులు రోదించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లారీని తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. దీనితో ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ స్తంభించింది. ఇటీవల నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వాహనాల ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.