ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం
అధికారుల తీరుపై ఆగ్రహం
సిద్దిపేట,మే4(జనం సాక్షి): అకాల వర్షాల నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కేంద్రాల్లోనూ సరిపడినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచకపోవడంతో ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి సరిపడా లారీలు కేటాయించడంలో అధికారులు, గుత్తేదారు విఫలం అవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట మార్కెట్ యార్డులోని పీఏసీఎస్ కేంద్రం నుంచి ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోంది. కానీ తడిసిన ధాన్యం బస్తాలను మిల్లుల్లో దించుకున్నాక…17 శాతం కన్నా అధికంగా తేమ ఉంది…మేం తక్కువగా బియ్యం ఇస్తామని మిల్లర్లు తెగేసి చెబితే అధికారులు ఏం సమాధానం చెబుతారో వేచిచూడాలి. ఇక తడిసిన ధాన్యం ఆరబెడితేనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అంటే రైతులు ఒకట్రెండు రోజులో కేంద్రాల్లోనే పడిగాపులు కాయక తప్పదు. ఇలా అకాల వర్షానికి పలు చోట్ల వరి పంట దెబ్బతినగా… కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్ల పేరిట అధికారులు హడావిడి చేసినా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచడంలో విఫలమయ్యారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన దాదాపు 1200 క్వింటాళ్ల ధాన్యం బస్తాలు పాక్షికంగా తడిశాయి. దుబ్బాక మార్కెట్ యార్డులోనే ఇదే స్థితి. నీటి ప్రవాహంలో ధాన్యం కొట్టుకుపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. హుస్నాబాద్ యార్డులో దాదాపు ఐదు వేల బస్తాల ధాన్యం, మూడు వేల బస్తాల మొక్కజొన్న నీటిపాలైంది. మిరుదొడ్డి మండలంలోని ఎనిమిది కొనుగోలు కేంద్రాల్లో దాదాపు రెండు వేల క్వింటాళ్లు తడిసింది. తొగుట మండలంలోని పలు గ్రామాల్లో 300 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. 150 ఎకరాల్లో కూరగాయలు, 15 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గజ్వేల్ నియోజకవర్గంలోని దాదాపు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.