ముంపు గ్రామాల ప్రజలకోసం మోడల్‌ విలేజ్‌లు

– మోడల్‌ విలేజ్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తాం
– గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరిపేరు నిర్ణయిస్తాం
– త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తాం
– లింగారెడ్డిపల్లి వద్ద మోడల్‌ విలేజ్‌కు భూమిపూజ చేసిన మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, జనవరి24(జ‌నంసాక్షి) : రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజల కోసం నిర్మిస్తున్న మోడల్‌ విలేజ్‌లో సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అనంతగిరి రిజర్వాయర్‌ ముంపు గ్రామం కొచ్చగుట్టపల్లికి, సిద్దిపేట అర్బన్‌ మండలం లింగారెడ్డిపల్లి పరిధిలో ప్రభుత్వం మోడల్‌ విలేజ్‌ నిర్మాణం చేపడుతుంది. మోడల్‌ విలేజ్‌కు హరీశ్‌రావు బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం హరీశ్‌ రావు మాట్లాడుతూ గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరి పేరు నిర్ణయిస్తమన్నారు. గ్రామస్తులకు త్వరలోనే నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు
నిర్వాసితులకే హక్కులు కల్పిస్తమని చెప్పారు. అనంతగిరి రిజర్వాయర్‌ కింద 30 వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ముట్రాజ్‌ పల్లి దగ్గర ఇండ్లను నిర్మిస్తామని వెల్లడించారు. కొండపోచమ్మ సాగర్‌ నిర్వాసితులకు తునికి బొల్లారంలో ఇండ్లు నిర్మించి ఇస్తమన్నారు. దసరాలోపు ఇండ్లను నిర్మించి ఇస్తమని హరీష్‌రావు స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారిని ప్రభుత్వం కడుపులోకి పెట్టుకొని కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హావిూ ఇచ్చారు. ఈకార్యక్రమంలో స్థానిక తెరాస నేతుల, అధికారులు పాల్గొన్నారు.

తాజావార్తలు