ముంబయిలో కుండపోత వర్షం

 అస్తవ్యస్తమైన నగర రహదారులు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు
ఆలస్యంగా నడిచిన విమాన రాకపోకలు
మరో రెండు రోజులు భారీ వర్ష సూచన
ముంబయి, జూన్‌9(జనం సాక్షి ) : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 32విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 3 విమానాలను రద్దు చేశారు. అటు లోకల్‌ రైళ్లు 10-15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సెంట్రల్‌ రైల్వే తెలిపింది. వర్షాల కారణంగా పరేల్‌ ప్రాంతంలో ఓ వాహనం బోల్తా పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ప్రజలకు సూచనలు చేశారు. డ్రైవింగ్‌ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప వీధుల్లోకి రాకూడదని స్పష్టం చేశారు. ముంబయిలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు 2005 భారీ వర్షాల కంటే తీవ్రమైన పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ముంబయి మున్సిపల్‌ శాఖలో పనిచేసే సీనియర్‌ అధికారులకు వారాంతపు సెలవులను రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. మత్స్యకారులు
సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందం, నేవీ అధికారులను అప్రమత్తం చేశారు. మరో రెండు రోజులు కూడా ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాముందని వాతావరణ శాఖ తెలిపింది.