ముంబయిలో కుండపోత వర్షాలు

– పలు రైలు సర్వీసులు నిలిపివేత.. ప్రజలు ఇక్కట్లు
– నిలిచిపోయిన డబ్బావాలా సేవలు
– గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు
ముంబయి, జులై10(జ‌నంసాక్షి) : దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరాన్ని రెండ్రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పశ్చిమ రైల్వే సబర్బన్‌ సర్వీసులు నిలిచిపోయాయని సీనియర్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. రాత్రి నుంచి 200 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్‌లపైనా నీళ్లు నిలిచిపోయాయి. ట్రాక్‌లపై
నీళ్లు తగ్గేవరకు రైళ్లను నిలిపేస్తామని అధికారులు తెలిపారు. జలమయమైన ప్రాంతాల నుంచి మోటార్లతో నీరు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్‌ రైల్వే సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం పలు రైళ్ల నిలిపివేయడం, కొన్ని ఆలస్యం కావడంతో నగరంలో కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గ్రేటర్‌ ముంబయి, థానే, రాయిగఢ్‌, పాల్‌గఢ్‌ ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని తెలిసింది. భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు మంచి నీరు సరఫరా చేసే తులసి సరస్సు పొంగి ప్రవహిస్తోంది. కార్యాలయాలకు టిఫిన్‌ బాక్సులు చేరవేసే డబ్బావాలాలు ఈరోజు నగరం మొత్తానికి తమ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోవడం వల్ల తాము టిఫిన్‌ బాక్సులు సరఫరా చేయలేమని చెప్పారు. ముంబయి విమానాశ్రయంలో విజిబులిటీ తక్కువగా ఉన్నప్పటికీ విమానాలు యథావిధిగా నడుస్తున్నాయి. విమానాలకు ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని అధికారులు తెలిపారు.