ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

భారీగా ఎగిసిపడిన అగ్నికీలలు
మాటలార్పేందుకు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
ముంబయి, జూన్‌9(జనం సాక్షి ) : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫోర్ట్‌ ప్రాంతంలోని పటేల్‌ ఛాంబర్స్‌లో శనివారం తెల్లవారుజామున 4.30గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భవనం నుంచి మంటలు ఎగిసిపడుతుంటడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. దాదాపు 150 మంది సిబ్బంది 18అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపుచేసేందుకు ప్రయత్నించాయి.  భారీ ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో సహాయకచర్యలకు తొలుత కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. కాగా.. ప్రమాదం ధాటికి భవనంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో సహాయక చర్యలు అధికారులు ముమ్మరం చేశారు.
గుజరాత్‌, బిహార్‌లలోనూ అగ్నిప్రమాదాలు..
గుజరాత్‌, బిహార్‌లలోనూ శనివారం అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సూరత్‌లోని ఓ డైయింగ్‌ మిల్లులో జరిగిన ప్రమాదంలో 35మందికి పైగా కూలీలు గాయపడ్డారు. మిల్లులోని ఆయిల్‌ పైపు లీకవడంతో మంటలు తలెత్తాయి. మంటల ధాటికి భవనంలోని ఓఅంతస్తు కూలిపోయి అక్కడ పనిచేస్తున్న కూలీలు గాయపడ్డారు. ఇక బిహార్‌ రాజధాని పట్నాలోని ఓ వంటగ్యాస్‌ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 6 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపుచేస్తున్నారు.