ముంబయి-గోవా రహదారిలో ఘోర ప్రమాదం

bridgeముంబయి: మహారాష్ట్రలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మహద్‌ వద్ద ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది. ప్రమాద సమయంలో వంతెనపై వెళుతున్న రెండు బస్సులు కొట్టుకుపోయాయి. రెండు బస్సుల్లో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 8 వాహనాలు కూడా నదిలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌ అధికారులను ఆదేశించారు.

50మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యల కోసం తీరరక్షక దళం చేతక్‌ హెలికాప్టర్‌ను రంగంలోకి దింపింది. సావిత్రినదిపై కూలిన వంతెన బ్రిటీష్‌ కాలం నాటిదని అధికారులు తెలిపారు. పురాతన వంతెన పక్కనే మరో కొత్త వంతెన కూడా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు కొత్త వంతెనపై నుంచి రాకపోకలు మళ్లించారు.ముంబయి నుంచి ప్రత్యేక అధికారుల బృదం ఘటనాస్థలికి బయలుదేరింది. రాయగఢ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది.