ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

రైళ్లు దారిమళ్లింపు..స్తంభించిన జనజీవనం

అధికారులతో సవిూక్షించిన సిఎం ఫడ్నవీస్‌

ముంబై,జూన్‌7(జ‌నం సాక్షి): ముంబై మహానగరం నీటమునిగిపోయింది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడిపోయేంతగా కుంభవృష్టి కురుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికార యంత్రంగం చర్యలు చేపట్టింది. మరోవైపు శని ఆదివారాల్లో అధికారులకు ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. మరో 72 గంటలు ముంబైతోపాటు మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తబోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పలు విమానాలను రద్దు చేశారు. రైళ్లను దారి మళ్లించారు. ముంబై మహానగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేయడంతో మహానగర పాలక సంస్థ అప్రమత్తం అయ్యింది. ఒర్లి, మాతుంగా సహా పలు ప్రాంతాల్లో దాదాపు అరగంట పాటూ వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఒక్కసారిగా ప్రారంభమైన వర్షం అరగంట పాటూ ఏకధాటిగా కురిసింది. భారీవర్షం కారణంగా ముంబైలో వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. మెట్రో రైళ్లు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆఫీసులకు వెళ్లే సిబ్బంది ట్రాఫిక్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణం సరిగా లేకపోవటంతో పలు రైలు సర్వీసులు అలస్యమయ్యాయి. విమాన సర్వీసులను దారి మళ్లీంచారు. ఐతే ఈ నెల 9 నుంచి 11 వరకు ముంబై నగరానికి భారీ వర్షం ముప్పు ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. దీంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అధికారులను ఆదేశించారు. ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌ సిబ్బందిని ముంబైలో మొహరించారు. బృహన్‌ మహానగర పాలిక సిబ్బందికి మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేశారు. అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. జనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తన కార్యాలయం నుంచే బృహన్‌ మహానగర పాలిక పనితీరును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.