ప్రశాంతంగా ముగిసిన ఉప ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎన్నికల ప్రచారం సాఫీగా సాగిందని, ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రచారాలు ప్రశాంత వాతావరణంలోనే సాగాయన్నారు. 12 జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి ఈనెల 12వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. 15వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఉప ఎన్నికల కోసం 5413 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో  60శాతం పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని ఆయన తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో 46 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని భన్వర్‌లాల్‌ తెలిపారు. గత రెండు మాసాల్లో రెండు లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని, వారంతా ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్దనే ఓటర్లకు స్లిప్‌లు ఇస్తారని ఆయన తెలిపారు.

తాజావార్తలు