ముగ్గురు లీకు దొంగల అరెస్టు

3

హైదరాబాద్‌,జులై 30(జనంసాక్షి): తెలంగాణలో ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో దళారులు, ఉపదళారుల అరెస్టులు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ముగ్గురిని జైలుకు పంపిన సీఐడీ అధికారులు.. ఇవాళ మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కీలక దళారి రాజగోపాల్‌రెడ్డితో పాటు హైదరాబాద్‌లోని రిసోనెన్స్‌ మెడికల్‌ అకాడవిూకి చెందిన వెంకటరమణ, రవీంద్రలను అరెస్టు చేసినట్లు సీఐడీ ప్రకటించింది. అసలు సూత్రధారి కోసం గాలింపు కొనసాగుతోంది. ముద్రణాలయం నుంచి ప్రశ్నాపత్రం బహిర్గతం చేయడంలో దిల్లీకి చెందిన ఇక్బాల్‌ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక్బాల్‌ అనుచరుడు రాజేశ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.బెంగళూరుకు చెందిన రాజగోపాల్‌రెడ్డి బెంగళూరులో 20 మంది విద్యార్థులతో శిబిరం నిర్వహించి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు తేలింది. హైదరాబాద్‌కు చెందిన విష్ణుధర్‌ 14 మందిని, విజయవాడకు చెందిన జ్యోతిబాబు ఆరుగురిని రాజగోపాల్‌ శిబిరానికి పంపారు. విద్యార్థుల నుంచి రూ.1.25 కోట్లను రాజగోపాల్‌ వసూలు చేసినట్లు సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ వెల్లడించారు.

ఎంసెట్‌ లీకేజీలో మరో దొంగ అరెస్ట్‌ కాగా పూణెలో దళారి రామకృష్ణను అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ లోని షేక్‌ రమేష్‌ నుంచి రామకృష్ణకు రూ. 1.20 కోట్లు ముట్టినట్లు సీఐడీ నిర్థారించింది. 14 మంది విద్యార్థుల నుంచి రమేష్‌ రూ. 1.73 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. ఎంసెట్‌-2 పేపర్‌ను రామకృష్ణ పుణెలో రమేష్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో అందిన సమాచారంతో పుణె వెల్లిన పోలీసులు అక్కడ రామకృష్ణను పట్టుకున్నారు. ఇదిలావుంటే ప్రశ్నపత్రం లీకేజీ అనంతర పరిణామాలపై సీఎం సుదీర్ఘ సవిూక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వ్యవసాయ, వైద్యఆరోగ్యశాఖ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఐడీ చీఫ్‌ సత్యనారాయణ, ఇంటలిజెన్స్‌ ఐజీ శివధర్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి, కొత్తగా నియమితులైన ఉపకులపతులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐడీ నివేదిక పురోగతిని పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు అందించారు. ప్రశ్నపత్రం లీకయిన తీరు, అందుకు బాధ్యులైన నేరగాళ్ల వివరాలను, కేసు పురోగతిని ఆయనకు వివరించారు. దీంతో పాటు ప్రశ్నపత్రాల లీకేజీల సమయంలో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు వ్యవహరించిన తీరు, అందుకు సంబంధించి ఆయా రాష్టాల్ర న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను న్యాయశాఖ కార్యదర్శి నివేదించారు. వీటన్నింటి ఆధారంగా ఎంసెట్‌-2 రద్దుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నపత్రం లీకయినట్లు ధ్రువీకరణ కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మరోసారి పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధ్యమైనంత మేరకు ఆగస్టులో పరీక్షలు నిర్వహించి, సెప్టెంబరు చివరి నాటికంతా ప్రవేశాలు పూర్తిచేయాలని, అది సాధ్యంకాని పక్షంలో గడువు పెంపుదలకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఎంసెట్‌ రద్దు, పరీక్షల నిర్వహణపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. భవిష్యత్తులో లీకేజీలు పునరావృతం కాకుండా చూడాలని, లీకేజీకి పాల్పడిన వారితో పాటు ప్రోత్సహించిన వారిని, వినియోగించుకున్న వారిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కష్టపడి చదివిన వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే భయపడే విధంగా శిక్షలు అమలు చేయాలని పేర్కొన్నారు.