మునగ సాగును వదులుకుంటున్న రైతులు

నష్టాలే కారణమని వెల్లడి
గద్వాల,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): మల్దకల్‌ మండలంలో మునగ పంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఇక్కడి భూములు తోటలకు అనుకూలంగా ఉండం తక్కువ నీటితో, కొద్ది పెట్టుబడితో
మునగతోటలు వేసిన రైతులు ఇప్పుడు  నష్టపోతున్నారు. మూడేళ్లుగా మునుగతోటలు కాయకపోవటంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకున్నారు. వరుసగా నష్టాలు రావటంతో రైతులు విధిలేక తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడేళ్ల కిందట మూడువేల ఎకరాలకు
వరకు మునగ తోటలు సాగయ్యాయి. తోటల తొలగింపుతో ప్రస్తుతం ఈ సాగు  తగ్గిపోయింది. అత్యధికంగా మల్దకల్‌ మండలంలో, ధరూరులో అతి తక్కువగా కేటీదొడ్డి మండలంలో  సాగవుతోంది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో నర్వ మండలంలో సాగు ఉండగా అక్కడ కూడా తోటలను తొలగిస్తున్నారు. మునగతోటలపై ఎన్నో ఆశలు పెట్టుకుని రుణాలు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులకు వరుసగా మూడేళ్లుగా నష్టాలు తప్పలేదు. ఎకరాకు రూ. 20వేల నుంచి రూ. 28వేల వరకు పెట్టుబడి పెట్టినా సగం తిరిగి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. చలికి పూత, పిందెలు విపరీతంగా వచ్చి జనవరి, ఫిబ్రవరి నెలల్లోపు మొదటి కాత పూర్తయ్యేది. ఈ ఏడు వాతావరణం అనుకూలించక మార్చి నెల వచ్చినా కాత లేక పూత, పిందెలతోనే నిలిచింది. మార్చినెల 15 తర్వాత కాత ప్రారంభమైనా  ఎకరాకు 5 నుంచి 10 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది. ధర కూడా క్వింటాలు రూ. 30 నుంచి రూ.45లోపే ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.వరుసగా మూడేళ్ల నుంచి వాతావరణం అనుకూలించక దిగుబడి రావడం లేదు. దీంతో తోటలను మార్చేస్తున్నామని రైతులు చెప్పారు.