మునుగోడు అసెంబ్లీ టిక్కెట్ బీసీలకే కేటాయించాలి.

-బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.
నల్గొండ. జనం సాక్షి
మునుగోడు అసెంబ్లీ టిక్కెట్ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించాలని శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో 65 శాతానికి పైగా బీసీలే ఉన్నారని బీసీలను కాదని 4 శాతం ఉన్న అగ్రకులాల వారికి టిక్కెట్ కేటాయిస్తే ఆయా పార్టీలను బొంద పెడతామని హెచ్చరించారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలు బీసీలను బ్యానర్లు కట్టడానికి, జిందాబాద్ లు కొట్టించడానికి, బహిరంగ సభలకు జనాలను తరలించడానికే బీసీలను వినియోగించుకుంటూ టిక్కెట్ల కేటాయింపులో మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నాయని అన్నారు. బీసీలకు టిక్కెట్లు ఇవ్వని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురిగాక తప్పదన్నారు. గ్రామ గ్రామాన పర్యటించి బీసీ వాదాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్య పరిచి ఆయా పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని కట్టెకోలు దీపెందర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, కర్నాటి నిరంజన్, మారోజు రాజ్ కుమార్, గొబ్బిళ్ళ  తదితరులున్నారు.

తాజావార్తలు