మునుగోడు ఉప ఎన్నికతో కెసిఆర్ దుకాణం బంద్ – భాజపా సీనియర్ నేత గజ్జల యోగానంద్ జోస్యం”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 20( జనంసాక్షి): కెసిఆర్ అండ్ కంపెనీకి మునుగోడు ఎన్నికనే చివరి అవకాశమని… ఇక తర్వాత కారు షెడ్డుకెళ్తుందని, కమలం వికసిస్తుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జ్ గజ్జల యోగానంద్ జోస్యం చెప్పారు. ఈ మేరకు గురువారం మునుగోడు నియోజకవర్గం పరిధి సంస్థాన్ నారాయణపురంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ కెసిఆర్ ‘ఆలీబాబా చాలీస్ చోర్’ దుకాణం త్వరలోనే మూతపడుతుందని, భారతదేశ చరిత్రలోనే ఇంత దరిద్రపు ముఖ్యమంత్రిని ఎవరూ చూడలేదన్నారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు తుపాకి రాముడు మాటలు, కారుకూతలు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీలేదని గజ్జల ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు తెరాస సేన దండుపాళ్యం బ్యాచ్ లా కనిపిస్తోందని, ప్రజలకు కల్లిబొల్లి మాటలు ఎన్నిచెప్పినా వారు నమ్మబోరని గజ్జల ధీమాను వ్యక్తంచేశారు. మునుగోడు తెరాస అభ్యర్థిని చూస్తేనే తెరాస సత్తా ఏంటో తెలుస్తుందని, ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని దుస్థితి అన్నారు. కెసిఆర్ అండ్ కంపెనీ త్వరలోనే తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఏ శక్తి ఇక అడ్డుకోలేదని ఆయన భరోసాను వ్యక్తంచేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బీహార్ తో మేళవించి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారని, రేపు జరిగే ఎన్నికల ఫలితాలలో ఇది తేటతెల్లమవుతుందన్నారు. బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్ర దోపిడీని పక్కనపెట్టి గులాబీ దండు మునుగోడు లో పర్యటిస్తుండడం వాస్తవమన్నారు. కెసిఆర్ అండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో నిజమైన అభివృద్ధిని చేపట్టి ఉంటే నేడు తెలంగాణ అసెంబ్లీ మొత్తం మునుగోడుకు రావలసిన కర్మ ఏంటని గజ్జల ప్రశ్నించారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికలకు ముందే టిఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటే కాస్త పరువైనా నిలబడుతుందని, లేదంటే బిజెపి కొట్టే చావు దెబ్బకు తెలంగాణ రాష్ట్రం నుండి గులాబీ రంగు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని గజ్జల పునరుద్ఘాటించారు.