మున్సిపల్‌ అక్రమాలపై విచారణ చేయాలి: టిడిపి

జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌21(జ‌నం సాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ కౌన్సిలర్లపై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. వియచారణఱ జరిపితే అక్రమాలు వెలుగు చూస్తాయని అన్నారు. భూపాలపల్లిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునిసిపాలిటీలో కొందరు కౌన్సిలర్‌లు విచ్చిలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, ఈ విషయం పత్రికల్లో ఆధారాలతో సహా వస్తున్నా స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్‌ మధుసూధనాచారి పట్టించుకోవడం లేదని అన్నారు. కౌన్సిలర్లు వసూళ్లకు పాల్పడే దాంట్లో మున్సిపల్‌ కమిషనర్‌కు వాటా ఉందని, నియోజకవర్గ ఎమ్యెల్యే అయిన స్పీకర్‌కు వాటా ఉందని ఆరోపించారు. గతంలో భూపాలపల్లి గ్రామపంచాయతీగా ఉన్న సందర్భంలో 12 మంది సిబ్బంది పని చేసేవారన్నారు. నగర పంచాయతీగా మారిన సందర్భంలో ఇందులో ముగ్గురిని మాత్రం తీసుకుని మిగతా వారిని తీసుకోలేదని, ఇందులో అవినీతి చోటు చేసుకుందన్నారు. వీటన్నింటిపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.