ముప్పులేదు: 2014లోనే ఎన్నికలు : చిదంబరం
ఢిల్లీ: యుపీఏ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని 2014లో జరుగబోయే ఎన్నికలకే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. తప్ప ఆ లోపున కాదని ఆర్ధిక మంత్రి పి. చిదంబరం శుక్రవారం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిలకడగా కొనసాగుతుందన్నారు.
చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులను అనుమతించే అంశం సహా పలు విషయాల మీద పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై విపక్షాలు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నాయన్న వార్తలపై ఎలాంటి ఆందోళనా లేదని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు, ‘ మేం బెదిరిపోవడంలేదు. ప్రభుత్వం స్థిరంగా ఉంది, పూర్తికాలం పాటు అధికారంలో ఉంటుంది. మే 2014లోనే ఎన్నికలు జరుగాతాయి.” అని పిటిఐతో అన్నారు.
యుపీఎ భాగస్వామ్య పక్షాలైన డీఎంకె, ఎస్పీ లేదా బీఎస్పీ నుంచి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల గురించి అడిగినప్పుడు అలాంటిదేమీ లేదని చిదంబరం స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమాజ్‌వాదీ పార్టీ శుక్రవారం ప్రకటించిన తోలి విడత జాబితా గురించి ప్రస్తావించినప్పుడు ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ఎస్పీ చర్య ముందస్తు ఎన్నికలకు సంకేతిక కాదా అన్నప్పుడు మే 2014లో జరిగే ఎన్నికలకోసం పార్టీలు ముందుగానే సిద్ధపడుతున్నాయన్నారు.
కాగా, 2014 ఎన్నికల కోసమే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కూడా ఒక సమన్వయ కమిటీని, మూడు సబ్-గ్రూప్‌లను నియమించినట్లు చిదంబరం గుర్తు చేశారు. ” దానర్థం ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయని కాదు. ఒక రాజకీయ పార్టీగా మేం కూడా తిరిగి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నార” అన్నారు.