ముమ్మరంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
బోనకల్ ,సెప్టెంబర్ 9 (జనంసాక్షి ):
బోనకల్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది ,అంగన్వాడీలు, ఆశలు , ఐకెపి సిబ్బంది తదితరులు టీమ్ గా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు . ఈ సందర్భంగా బోనకల్ ఎంపీడీవో వేణుమాధవ్ మండలంలోని ముష్టికుంట్ల ,సీతానగరం తదితర గ్రామాలలో శుక్రవారం పర్యటించి ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వేణుమాధవ్ మాట్లాడుతూ ఇంటిలోపల, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పగటిపూట మాత్రమే కుట్టే ఎడిస్ ఈజిప్ట్ దోమ వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని, ఈ దోమ మంచినీటి నిల్వల్లో వృద్ధిచెందుతుందని అన్నారు. పాత టైర్లు, మురుగు కాల్వలు, కొబ్బరిచిప్పలు, ఎయిర్ కూలర్లు, డ్రమ్ములు, బకెట్లు, బిందెల్లో ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచడం వల్ల అందులో లార్వా పెరిగి దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. వర్షాలు పడుతున్నందున దోమలు పెరిగి, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. దోమల నియంత్రణతో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టవచ్చని ఆయన అన్నారు. వర్షాకాలం కావడంతో దోమల వృద్ధితో డెంగీ, మలేరియాకి గురవుతారని ఆయన అన్నారు. టైర్ షాపులు, పాత ఇనుప సామానుల షాపులు, ఆటోమొబైల్, పంక్చర్, కూల్ డ్రింక్స్ తదితర షాపుల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని తెలిపినట్లు, లేనిచో చర్యలు తీసుకోనున్నట్లు ఆయన అన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడడం, ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మొక్కల కుండీలు, కూలర్లలో, ఉపయోగంలో లేని వస్తువులలో నీటి నిల్వలను తొలగించి, తేమోపాస్ ద్రావణం పిచికారీ చేయించారు.
పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపడుతున్నట్లు వారు తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫినాయిల్, మలాధీన్లతో స్ప్రే తో పాటుగా ఫాగింగ్ చేయడం జరుగుతుందన్నారు. పరిశుభ్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా గుర్తెరిగి నడవాలన్నారు. అదేవిధంగా సిబ్బందితో టీములను ఏర్పాటు చేసి పకడ్బందీగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.