ముస్లింలను పాకిస్తాన్‌ పొమ్మనలేదు

2

– హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌

హైదరాబాద్‌  అక్టోబర్‌ 16 (జనంసాక్షి):

భారత్‌లో ముస్లింలు ఉండొచ్చుగానీ పశుమాంసం తినడం మానేయాలంటూ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ముస్లింలను పాకిస్థాన్‌కి వెళ్లిపోమని తాను అనలేదని స్పష్టం చేశారు. తన మాటల్ని తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందుకు తాను చింతిస్తున్నానన్నారు.

గురువారం ఖట్టర్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారత్‌లో ముస్లింలు ఉండొచ్చు. కానీ పశుమాంసం తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆవు దైవమని నమ్ముతారు’ అని వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక ఈ రోజు ప్రచురించింది. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడుకాదని విమర్శించాయి. ఈ నేపథ్యంలో ఆయన పై విధంగా వివరణ ఇచ్చారు.