మూడు నెలల్లోగా పంచాయితీ ఎన్నికలు
ఎపి సర్కార్ను ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్లో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇక ఎన్నికలకు వెళ్లడం మినహా చంద్రబాబుకు గత్యంతరం లేకుండా పోయింది. తెలంగాణలో కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చిన హైకోర్టు ఇప్పుడు ఎపిలో
కూడా మూడు నెలల్లోగా ఎన్ఇనకలు జరపాలని ఆదేశించింది. పంచాయతీల కాల పరిమితి ముగియడంతో ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించేలా ప్రభుత్వం ఇటీవల జీవో 90ని తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. కాల పరిమితి ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తోందని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేక అధికారుల పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత ఎన్నికలు తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఎపిలో టిడిపి ప్రభుత్వం మే వరకు కొనసాగనుంది. మేలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ దశలో జనవరిలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.