మూడు రోజులపాటు ఆవిర్భావ ఉత్సవాలు

రైతుబంధు చిక్కులను తొలగిస్తాం: కలెక్టర్‌
మెదక్‌,మే29(జ‌నం సాక్షి ): రాష్ట్ర ఆవిర్బావ ఉత్సవాలను మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నాల్గో ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని  అధికారులకు సూచించారు.  అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు.  ఇటీవల ప్రభుత్వం అందజేసిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో కొన్నిచోట్ల తప్పుడు వివరాలు నమోదయ్యాయని భూములు ఉన్న రైతులకు చాలా మందికి రైతు బంధు చెక్కులు, పట్టాపాసుపుస్తకాలు రాలేదని, భూములు లేని వారికి పట్టాపాసుపుస్తకాలు, చెక్కులు వచ్చాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.  రైతుబంధు పథకంలో భాగంగా పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి స్పష్టం చేశారు.  జిల్లాలో రైతుబంధు పథకం వందశాతం పూర్తి చేసేలా రైతు సమన్వయ సమితి సభ్యులు సహకరించాలన్నారు. జిల్లాలో 2 లక్షల 12వేల మందికి చెక్కులు వచ్చాయని, అందులో లక్షా 88వేల పాసుపుస్తకాలను పంపిణీ చేశామన్నారు. అయితే ఇంకా 29వేల మందికి చెక్కులు, పాసుబుక్కులు రాలేదన్నారు. అందులో 25వేల మంది ఆధార్‌ లింక్‌ చేయలేదని, 5వేల మంది మాత్రమే ఆధార్‌ లింక్‌ చేశారని అన్నారు. ఆధార్‌ లింక్‌లో ఫొటోలు డౌన్‌లోడ్‌ కాలేదని, విూ సేవకు వెళ్లి డౌన్‌లోడ్‌ చేస్తే పాసు బుక్కులు వస్తాయని సూచించారు. చనిపోయిన వారికి సంబంధించి పార్ట్‌ బీలో పెట్టడం జరిగిందన్నారు. రెండు రోజుల క్రితం సీఎం సమావేశంలో రైతు సమన్వయ సమితి సభ్యులే గ్రామాల్లో రైతులకు సంబంధించిన తప్పులను సరి చేయాలని సూచించడం జరిగిందన్నారు. వచ్చే నెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని అన్నారు. పాసుబుక్కులు, చెక్కుల్లో తేడావస్తే సరి చేయడం జరుగుతుందని, డబ్బులను డ్రా చేయవద్దని సూచించారు. అన్ని గ్రామాల్లో రైతు సమన్వయ సమితి సభ్యులు రైతులకు సంబంధించిన పాసుబుక్కులు,
చెక్కుల విషయంలో తహసీల్దార్లకు, వీఆర్వోలకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామాల్లో రైతులకు సంబంధించిన పట్టాపాసు పుస్తకాల్లో తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్ధాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితి సభ్యులపై ఉందన్నారు. అయితే ఒక వీఆర్వో నాలుగైదు గ్రామాలకు ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, కొంత మంది వీఆర్వోలకు అవగాహన లేదని అన్నారు. అదే రీతిలో తహసీల్దార్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
—————-