మూడోసారి అధికారంలోకి బీఆర్‌ఎస్సే
` టికెట్లు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్
` పదవుల కోసం, అధికారం కోసం కుమ్ములాటలు
` మాటలు, మంటలు, ముఠాలు, మూటలు.. ఇదీ సంస్కృతి
` కాంగ్రెస్ కు మంత్రి హరీశ్ రావు చురకలు
సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 10(జనంసాక్షి):రాష్ట్రంలో డిసెంబర్ 3న మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కల్లోల ప్రాంతంగా, కరవు సీమగా ఉన్న హుస్నాబాద్ ను సస్యశ్యామలం చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, కరీంనగర్ బీ ఆర్ ఎస్ అధ్యక్షులు జివి రామకృష్ణారావు, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డా. ఎం సుధీర్ కుమార్ హాజరయ్యారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఫేక్ సర్వేలతో, గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలోను ఇలాంటి కలలే కాంగ్రెస్ నాయకులు కన్నారని, మంత్రిపదవులు కూడా పంచుకున్నారని చురకలంటించారు. కాంగ్రెస్ నేతలు టికెట్లు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి లో ఉన్నారని, వాళ్ళు ఢల్లీిలో ఎక్కువ, గాలిలో తక్కువగా ఉంటున్నారని, ఈ మధ్య ఢల్లీికి వయా బెంగుళూరు విూదుగా వెళ్తున్నారని ఎద్దేవా చేసారు. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పోటీ పడుతున్నారని, ఒకరికి టికెట్ వస్తే.. మరొకరు ఓడిస్తారని అయన విమర్శించారు. ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పదవులకోసం సి ఎం కుర్చీ కోసం తన్నుకుచస్తారే తప్ప ప్రజలగురించి ఏమాత్రం పట్టించుకోరని మంత్రి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హావిూలను ప్రజలు నమ్మరని, ఆ పార్టీ హయాంలో ఎరువుల కోసం చెప్పులు పెట్టారని, కరెంట్ కోసం రోడ్డెక్కి ధర్నాలు చేసారని, చెరువులను పట్టించుకోలేదని, నీళ్లు ఇవ్వలేదని, కరెంటుకూడా మూడు పూటలు చాలని అంటోందని మండిపడ్డారు. నాడు తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంబించింది, తద్వారా ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తు చేసారు.
లక్ష మందితో సభ :ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్
హుస్నాబాద్ లో ఈ నెల 15 న జరిగే సి ఎం కేసీఆర్ సభకు లక్ష జనసవిూకరణ చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ ప్రాంతం సిద్ధిపేట జిల్లాలో కలపకుంటే.. పరిస్థితి అలాగే ఉండేదని, కానీ సిద్ధిపేట జిల్లాలో చేర్చడం వల్ల అతి తక్కువ సమయంలో మంత్రి హరీష్ రావు కృషితో వెనుకబడిన మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టాయని అన్నారు. సి ఎం కేసీఆర్ మూడు గంటలకే వస్తారని, అప్పటికే సభాస్థలికి అందరు చేరుకోవాలని అన్నారు.
గొప్పగా స్వాగతం పలకాలి : ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ లో ఈ నెల 15 న జరిగే సి ఎం కేసీఆర్ తొలి ఎన్నికల ప్రచార సభకు వేదికగా హుస్నాబాద్ కు ఎంచుకోవడం గర్వగా, సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. వేరే నియోజకవర్గాల నుండి కూడా అభ్యర్థనలు వచ్చినప్పటికీ సి ఎం కేసీఆర్ హుస్నాబాద్ ఫైనల్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సి ఎం కేసీఆర్ సభను కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని కోరారు. డప్పు చప్పుళ్ళు, బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, నృత్యాలతో ఉత్సాహంగా తరలిరావాలని, కులసంఘాలు, వృత్తి సంఘాలు తమ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పాల్గొనాలని కోరారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.