మృత్యు ఒడిలోకి ఆమె
ఆమె ఇకలేరు..!ఢిల్లీలో హైఅలర్ట్..భారీగా భద్రత బలగాల మొహరింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 29 : ఆమె మనో నిబ్బరం ఓడింది.. వైద్యుల కృషి ఫలించలేదు..మృత్యు కౌగిలిలో ఒరిగిపోయింది. 13 రోజుల పాటు మృతువుతో పోరాడింది.. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు పారామెడికల్ విద్యార్థిని (23) మృతి చెందినట్టు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విద్యార్ధిని మృత దేహాం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా పారామెడికల్ విద్యార్థిని ఈ నెల 16వ తేదీ రాత్రి దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో గ్యాంగ్ రేప్‌కు గురైన విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం సఫ్ధర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చడం.. 21,22, 23 తేదీల్లో విద్యార్థులు నిరసన తెలపడం.. నిందితులను ఉరితీయాలని నినాదాలు చేయడం.. మెరుగైన చికిత్స కోసం బుధవారం రాత్రి సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేయడం.. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం.. జనవరి 2న విచారణ ప్రారంభం కానుండడం విదితమే. ఇదిలా ఉండగా కేసును హత్యానేరం కేసుగా పోలీసులు మార్చారు. 2 నుంచి విచారణ ప్రారంభం కానున్నది.
ప్రముఖుల సంతాపం..
పారా విద్యార్థిని మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి సంతాపం తెలిపారు. ప్రజలు సహనం కోల్పోవద్దని పిలుపునిచ్చారు.ఆమె మృతి దురదృష్టకరం.. ఆమె మృతి పట్ల ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. దేశ రాజధానిలో అత్యాచారానికి గురైన ఆమె సింగపూరులో చికిత్స పొందుతూ మరణించడం బాధాకరం..అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తదితరులు పారా మెడికల్ విద్యార్థిని మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు.
ఢిల్లీలో హైఅలర్ట్!
ఆమె మృతి పట్ల ప్రభుత్వం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది.విజయ్‌చౌక్, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, జన్‌పథ్-10 మార్గాలన్నింటిని మూసివేశారు. అంతేగాక 10మెట్రో రైల్వే స్టేషన్లను ముందు జాగ్రత్త చర్యగా మూసివేశారు. రైల్వేస్టేషన్, బస్టాండు, ప్రధాన కూడళ్లల్లో భారీగా భద్రతా దళాలను మొహరింప జేశారు. సర్వత్రా నిషేధాజ్ఞలు విధించారు. ప్రముఖుల నివాసాల వద్ద కూడా సిఆర్‌పిఎఫ్ బలగాలు మొహరించాయి.