మెట్రోకు అంతరాయం

– కరెంట్‌ లేక ఆగిపోయిన హైదరాబాద్‌ మెట్రో
– తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు
హైదరాబాద్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం బాలానగర్‌ అంబేద్కర్‌ స్టేషన్లో రైలు నిలిచిపోయింది. మియాపూర్‌ నుంచి అవిూర్‌పేట వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అర్థాంతరంగా ట్రైను నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణీకులు మెట్రో రైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఒక మెట్రో రైలు నిలిచిపోవడంతో… ఆ రూట్‌లో మిగతా సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు
ఎదుర్కొన్నారు. పవర్‌ ప్లాంట్‌లో సమస్య తలెత్తిన కారణంగానే రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న టెక్నికల్‌ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో మొదట నాగోల్‌ నుంచి మియాపూర్‌ వరకు సర్వీసులను ప్రారంభం కాగా.. తాజాగా ఎల్బీనగర్‌ – అవిూర్‌పేట్‌ మధ్య మెట్రో సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.