మెట్రోతో కాలుష్యం తగ్గుతుంది
ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్న గవర్నర్
ప్రపంచంలోనే అత్యుత్తమమైందన్న కెటిఆర్
హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): హైదరాబాద్ మెట్రోను అందరూ తమదిగా భావించి ఉపయోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. మెట్రో అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు సమయం ఆదా కానుందన్నారు. అతాగే నగరంలో కాలుష్యం తగ్గాలంటే మెట్రో ప్రయాణమే మంచిదని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. అవిూర్‌పేట – ఎల్బీనగర్ మెట్రో రైలు ప్రారంభం సందర్భంగా ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ ప్రసంగించారు. హైదరాబాద్ ప్రజలు మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దీని వల్ల రోడ్లపై రద్దీని కూడా తగ్గించవచ్చు. అంబులెన్స్‌లు సహా అత్యవసర సేవల ప్రయాణాలకు ఆటంకం లేకుండా చేసిన వాళ్లమవుతామని గవర్నర్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులకు సింగిల్ కార్డు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ 15 వరకు హైటెక్‌సిటీ కారిడార్‌ను పూర్తి చేయాలని గవర్నర్ కోరారు. ప్రతీ మెట్రో స్టేషన్‌లో దశలవారీగా సౌకర్యాలు కల్పిస్తాం. మెట్రో స్టేషన్లలో సౌకర్యాలు లేవని విమర్శలు చేయొద్దని గవర్నర్ చెప్పారు. మెట్రో స్టేషన్లలో ఆహార పదార్థాలు అందుబాటులోకి తెస్తామన్నారు. మెట్రోను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులపై ఉందన్నారు. అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ అండ్ టీకి గవర్నర్ అభినందనలు తెలిపారు. ఇకపోతే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రతీ మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ మెట్రోలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ మెట్రోను తీర్చిదిద్దామని చెప్పారు. అందరికీ సౌకర్యంగా ఉండేలా ప్రతి
మెట్రో స్టేషన్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైలుకు చాలా అవార్డులు వచ్చాయన్నారు. ఐజీబీఎస్ సంస్థ.. హైదరాబాద్ మెట్రోకు ఎ/-లాటినం అవార్డును అందజేసిందని గుర్తు చేశారు. దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రో రైలు మార్గం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రపంచంలోనే ప్రభుత్వ – ప్రయివేటు భాగస్వామ్యంలో అతిపెద్ద ప్రాజెక్టును చేపట్టామని గుర్తు చేశారు. ప్రాజెక్టుపై ఎల్ అండ్ టీ రూ. 12 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే భూసేకరణ చేశామన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టామని తెలిపారు. పంజాగుట్టలో రద్దీ ఉన్నా.. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అన్ని రకాల నాణ్యతా ప్రమాణాలు పాటించి మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రయాణికులు నడక ద్వారా మెట్రో స్టేషన్లకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. ఎప్పటికప్పుడు అధికారులు మెట్రో స్టేషన్లను తనిఖీ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ ఉద్ఘాటించారు.