మెట్రో ఉద్యోగాలు స్థానికులకే

1

– కేంద్రమంత్రి దత్తాత్రేయ

హైదరాబాద్‌,మే 2 (జనంసాక్షి):

మెట్రో రైలు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. మెట్రోరైలును త్వరగా పూర్తి చేసి నగరవాసులకు అందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 2001లో మెట్రోప్రాజెక్ట్‌ కోసం కష్టపడ్డానన్నారు. మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం రూ.2500 కోట్లు కేటాయించిందన్నారు. మెట్రో ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని కేంద్రమంత్రి దత్తాత్రేయ తెలిపారు. శనివారం నాగోల్‌ మెట్రో స్టేషన్‌ను, మెట్రోరైలు దత్తాత్రేయ పరిశీలించారు. మెట్రోరైలు పనిని త్వరగా పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపించాలని  బండారు దత్తాత్రేయ కోరారు. భూముల అగ్రిమెంట్‌ వంటి చిన్నచిన్న విషయాల్లో యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య ఏమైన సమస్యలుంటే పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. తాను స్వయంగా సీఎంను కలసి వీటిపై సమగ్ర చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. మెట్రో రైలు నిర్మాణం జరుగుతున్న విధానం, పనుల పురోగతిపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరా తీశారు. ఈ మేరకు ఆయన నాగోలు మోట్రో డిపోను సందర్శించి అక్కడి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెట్రోలో రోజుకు సుమారు 60వేల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న దత్తాత్రేయ ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. నగరాన్ని పీడిస్తున్న ట్రాఫిక్‌ సమస్యను అధిగమించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేందుకు చొరవ తీసుకుంటానని హావిూ ఇచ్చారు. మెట్రోరైలు ప్రారంభంపై నిర్ణయం తీసుకోలేదని దానిపై ప్రభుత్వానికి తుది నిర్ణయమని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది మెట్రోను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సాంకేతిక కారణాలతో తొలిదశ ప్రారంభం ఆగిందని వివరించారు. ఇప్పటి వరకు 50 శాతం మెట్రో పనులు పూర్తి అయ్యాయని ఆయన చెప్పారు. 43 కిలో విూటర్ల మేర పిల్లర్లు వేశామన్నారు. త్వరగా మెట్రో పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.  మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కూడా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తమకు సూచించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలోనే క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మెట్రో ప్రారంభంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, ఇప్పటి వరకు తేదీ నిర్ణయం కాలేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివెంట స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.