మెడికల్‌ కౌన్సిల్‌ గుడువు పొడగింపు

untitled-12
– అక్టోబర్‌ 7 వరకు ప్రక్రియ కొనసాగింపు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 28(జనంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో మెడికల్‌ కౌన్సిలింగ్‌ గడువు అక్టోబర్‌ 7 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. నెలరోజుల గడువు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ వారం రోజులపాటు పొడిగించింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీం ఈ మేరకు ఆదేవౄలు ఇచ్చింది. తెలంగాణలో ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకవడంతో కౌన్సిలింగ్‌ పక్రియ పూర్తి చేసేందుకు గడువు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణలో గడువు పొడిగిస్తే తమ రాష్ట్రంలో కూడా గడువు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో పిటిషన్‌ దాఖలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు రెండు రాష్ట్రాల్లో  కౌన్సిలింగ్‌ హాజరయ్యే అవకాశమున్నందున తెలంగాణతో పాటు ఏపీలో కూడా కౌన్సిలింగ్‌ గడువు పొడిగించాలని ఏపీ ప్రభత్వ తరఫు న్యాయవాది కోరారు. అయితే  మెడికల్‌ కౌన్సిలింగ్‌ గడువు పొడిగించేందుకు భారత వైద్య మండలి అభ్యంతరం తెలిపింది. అన్ని వర్గాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తెలుగు రాష్ట్రాల్లో మెడికల్‌ కౌన్సిలింగ్‌ అక్టోబరు 7లోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కనీసం పది రోజులైనా గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ కోరినప్పటికీ కోర్టు నిరాకరిస్తూ కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చింది. అలాగే డెంటల్‌, మెడికల్‌ కౌన్సెలింగ్‌ అక్టోబర్‌ 7 వరకు గడువు పొడిగించారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈనెల 30లోగా  మెడికల్‌ కౌన్సిలింగ్‌ ముగించాల్సి ఉంది. తెలంగాణలో ఎంసెట్‌ పేపర్‌ లీక్‌ కావడంతో ప్రవేశాల పక్రియలో జాప్యం జరుగుతోంది. దీంతో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కోర్టును ఆశ్రయించింది. తెలంగాణతో పాటు తమకు గడువు ఇవ్వాలని ఏపీ కూడా కోర్టును కోరింది.