-మెడికల్ కాలేజీ తెచ్చానంటున్న ఎంఎల్ఏ పేదల సాగు భూములను ఎలా గుంజుకుంటారు.

-మెడికల్ కాలేజీకి భూ సేకరణలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పాటించలేదు.
-మెడికల్ కాలేజీ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బిఎస్పీ పోరాడుతుంది.
-బిఎస్పీ జిల్లా అధ్యక్షులు అంతటి నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు20 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకుని వచ్చానని ప్రగల్బాలు పలుకుతున్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తర తరాల నుండి పేదలు సాగు చేసుకుంటున్న సాగు భూములను ఎలా గుంజుకుంటాడనీ బిఎస్పీ జిల్లా అధ్యక్షులు అంతటి నాగన్న, జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి కుమార్, జిల్లా కార్యదర్శి బోనాసి రాంచందర్ లు ప్రశ్నించ్చారు.శనివారం ఉయ్యాలవాడ గ్రామ శివారులో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భూములను బిఎస్పీ నాయకులు పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీకి భూ సేకరణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పాటించలేదనీ అన్నారు. నోటీసులు ఇవ్వకుండా, సరైన నష్ట పరిహారం ఇవ్వకుండా, కేవలం కళ్ళబోల్లి కబుర్లు చెప్పి, ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అమాయకపు రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు.కాగితాలలో  ఏం ఉందో కూడా చెప్పకుండా, సంతకాలు తీసుకున్నారని వివరించారు. మెడికల్ కాలేజీ భూ నిర్వసితూలకు భూమికి భూమి, సరైన నష్టం పరిహారం, భూ నిర్వాసితుల ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్ సదుపాయాలు కల్పించే వరకు బిఎస్పీ పోరాడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్మాణాలు చేప్పట్టిన నిరుపేద, పేద బహుజనుల భూములను అక్రమంగా గుంజుకుని నిర్మిస్తున్నదే తప్ప – ఎక్కడ కూడా భూ స్వాముల, భూములు తీసుకోవడం లేదని చెప్పారు.భూ నిర్వసితుల తరపున జరిగే పోరాటంలో అవసరం ఐతే జైలుకు కూడా వెళ్ళడానికి బిఎస్పీ పార్టీ సిద్ధం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ కమిటీ ఉపాధ్యక్షులు పరుశరామ్, తిమ్మాజిపేట్ మండల కన్వీనర్లు మీదింటి సురేందర్, బర్ల రాజ్ మరియు మెడికల్ కాలేజీ భూ నిర్వాసితులు పాల్గొన్నారు.