మెదక్‌లో అడుగంటిన భూగర్భ జలాలు

మంచినీటి అవసరాలకు కార్యాచరణ
11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రతిపాదనలు
మెదక్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లాలో నీటి ఎద్దడిని నివారించేందుకు రూ.11.93 కోట్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. గ్రామాల్లోని తాగునీటి వనరులు ఎండిపోవటం, తాగునీటి బోరుబావుల్లో నీటి మట్టాలు పడిపోవటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తే గ్రామాలను గుర్తించారు.  మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంట మండలాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయి. దీంతో వేసవిలో ఈ మూడు మండలాల్లో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సింగూరు ప్రాజెక్టులో నీరు ఎండిపోయిన నేపథ్యంలో మిగితా 17 మండలాల్లో మిషన్‌ భగీరథ ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ఈ 17 మండలాల్లో 900కు పైగా ఆవాసాలు ఉన్నాయి.   ఇందులో 801 గ్రామాల్లో తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి.
ఒక వైపు సింగూరు ప్రాజెక్ట్‌ పూర్తిగా అడుగంటింది. దీంతో  మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి వచ్చే తాగునీటి సరఫరా నిలిచిపోయింది.  మరోవైపు  భూగర్భజలాలు అందనంత లోతులోకి వెళ్లిపోయాయి.  ఈ నేపథ్యంలో గ్రావిూణ నీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. దీనికోసం అధికారులు గ్రామాల్లో  ప్రత్యేక సర్వేలు నిర్వహించి  నీటి సమస్య ఉత్పన్నమయ్యే గ్రామాలను గుర్తించారు.  దీని ప్రకారం 17 మండలాల్లోని 801 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉండనున్నాయి.
కౌడిపల్లి మండలంలో అత్యధికంగా 96 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఏర్పడనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ సర్వేలో తేలింది. ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి.  తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ముందస్తుగానే రూ.11.93 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసింది.  లో తాగునీటి సమస్య తలెత్తనున్న 281 గ్రామాలకు తాగునీటి ట్యాంకర్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. తాగునీటి సమస్య తలెత్తనున్న 801 గ్రామాలకు  తాగునీటి రవాణా, బోరుబావుల మరమ్మతు, వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవటం, బోరుబావుల ప్లషింగ్‌, డీపెనింగ్‌ పనులు చేపట్టేందు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపింది.

తాజావార్తలు