మెదక్ బరిలో మళ్లీ కెసిఆర్ పోటీ
జాతీయరాజకీయల కోసం ఎంపిగా పోటీ
కాంగ్రెస్ పార్టీలో పోటీకి కనపడని ఆసక్తి
మెదక్,ఫిబ్రవరి19(జనంసాక్షి): జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సిఎం కెసిఆర్ మరోమారు మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేయాలని ఆహ్వానాలు అందుతున్నా మెదక్‌ను మాత్రమే ఆయన సేఫ్‌గా భావిస్తున్నారని సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్‌ఇనకల ఫలితాలు కూడా ఇందుకు కారణంగా చూడవచ్చు. ఫెడరల్ ప్రంట్‌లో భాగంగా జాతీయ స్థాయిలో ముందుకు సాగాలని కెసిఆర్ నిర్ణయించుకున్‌ఆనరు. దీంతో మెదక్ పై కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తారని ముందుగా ప్రచారం సాగింది. అయితే ఆమెకూడా పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. తెలంగాణలోని మరోస్థానం నుంచి ఆమె పోటీలో నిలవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి కూడా పోటీచేస్తారని భావించినప్పటికీ వారు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎవరూ పోటీచేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. సిఎం కెసిఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని బలంగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయనతో పోటీ పడేందుకు ఎవరు కూడా సిద్దంగా లేరు. కెసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినందున ఆయన మెదక్ బరిలో ఉంటారని అంటున్నారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలారెడ్డిని మెదక్ ఎంపీ బరిలో దింపాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇస్తే ఎంపీగా గెలిపిస్తానని చెబుతున్నారు. తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తన భార్య నిర్మలకు టిక్కెట్ ఇప్పించేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ దశలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఈ నెలాఖరున కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే జిల్లాకు చెందిన కొందరు నేతలు మాత్రం ఎంపీగా పోటీచేస్తామని ముందుకు వస్తున్నారు. అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత డాక్టర్ శ్రవణ్ కుమార్‌రెడ్డి సోమవారం పీసీసీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకుడు మద్దుల సోమేశ్వర్‌రెడ్డి, తన భార్య మద్దుల ఉమాదేవికి టిక్కెట్ ఇవ్వాలని దరఖాస్తు సమర్పించారు. అలాగే యువజన కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి మంగళవారం దరఖాస్తు చేసుకున్నాడు. పటాన్‌చెరువు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ నాయకుడు ఎం.ఏ. ఫయీం సైతం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. మరోవైపు బీజేపీ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థుల ఎన్నికపై కసరత్తు జరుగుతుంది. ఇటీవల మెదక్ అసెంబ్లీనుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన రాజయ్య ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆయన మినహా నాయకులు ఎవరూ పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.