మెమన్ ఉరికి ముందు..ఏం జరిగింది ?

rxvcirtpమహారాష్ట్ర : బుధవారం అర్థరాత్రంతా హైడ్రామా నడిచింది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ కొనసాగింది. కాని చివరకు ప్రభుత్వ పట్టుదలే గెలిచింది. యాకుబ్ సుదీర్ఘ పోరాటం ఓడిపోయింది. చివరి ఘడియ వరకు ప్రయత్నించినా…యాకుబ్‌కు ఫలితం లేకపోయింది. చివరకు ఉదయం ఆరున్నర గంటలకు….పుట్టినరోజు నాడే….యాకుబ్ ఉరికొయ్యకు వేలాడాడు. ఈ నెల 29 ఉదయం నుంచి…మెమెన్‌ ఉరిశిక్ష అమలుపై హైడ్రామా కొనసాగింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు యాకుబ్ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం పన్నెండున్నరకు యాకుబ్‌కు క్షమాభిక్షపెట్టవద్దని.. అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సాయత్రం నాలుగు గంటలకు మహారాష్ట్ర గవర్నర్ యాకుబ్ క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించారు. నాలుగున్నర గంటలకు యాకుబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి..
క్షమాభిక్ష పెట్టాలని యాకుబ్‌ రాష్ట్రపతిని కూడా కోరాడు. దీంతో 29న సాయంత్రం ఐదున్నరకు …రాష్ట్రపతి క్షమాభిక్ష విజ్ఞప్తిని హోంశాఖకు పంపారు. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు రాజ్‌నాథ్‌ స్వయంగా రాష్ట్రపతిని కలిసి…క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించాలని అభిప్రాయాన్నిచెప్పారు. దీంతో రాత్రి 10.47నిమిషాలకు రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు.
మరోసారి సుప్రీం తలుపు తట్టిన మెమన్..
రాత్రి 10:37కు సుప్రీంలో మరోసారి యాకుబ్ లాయర్ పిటిషన్ వేశారు. రాత్రి 11 :16కి ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని చీఫ్‌ జస్టిస్‌ను కోరారు. క్షమాభిక్ష విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత..ఉరితీత అమలుకు కనీసం 14 రోజుల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిబంధనలు చెబుతున్నాయని లాయర్లు పిటిషన్ వేశారు. శిక్షను 14 రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. అర్ధరాత్రి 02: 30కి సుప్రీం కోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు ప్రారంభమయ్యాయి. హోరాహోరీ వాదనల తర్వాత..ఉదయం 04 :30కి సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఉదయం 04 :30 ఉరిశిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీంతో ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో యాకుబ్‌ను నాగ్‌పూర్ జైలు అధికారులు ఉరితీశారు. ఉదయం 7 గంటలకు యాకుబ్ మృతి చెందినట్లు జైలు అధికారులు అధికారికంగా ప్రకటించారు.
రాత్రి భోజనం చేయని మెమన్..
యాకుబ్ మెమన్‌ 29న మధ్యాహ్నం రెండు చపాతీలు తిన్నాడు. రాత్రి భోజనం తినేందుకు నిరాకరించాడు. నిబంధనల ప్రకారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు యాకుబ్‌ను జైలు అధికారులు నిద్రలేపారు. ఆ తర్వాత స్నానం చేసి అధికారులు ఇచ్చిన కొత్త దుస్తులు ధరించాడు మెమన్‌. చివరిసారిగా తనకు ఇష్టమైన కిచిడీని అల్పాహారంగా తీసుకున్నాడు. రేపు అతని కూతురు పుట్టినరోజు కావటంతో…ఆమెతో మాట్లాడాలని చివరి కోరిక కోరాడు. కాని అందుకు జైలు అధికారులు నిరాకరించారు.
యాకుబ్‌ ఉరి నేపథ్యంలో నాగపూర్ సెంట్రల్ జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. ముంబైతో పాటు దేశవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.