మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
– కేసీఆర్ తీరుతో ముస్లింల ముఖాల్లో చిరునవ్వు
– మంత్రి హరీశ్ రావు
– పేద ముస్లింలకు వస్త్రాలు పంపిణీ చేసిన మంత్రి
మెదక్, జూన్5(జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్‌లో 1250 మంది పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముస్లింల సంక్షేమ కోసం ముఖ్య
మంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం లక్ష నూటా పదహార్ల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.
దేశంలో ఏ సీఎం ఆలోచించని రీతిలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపకల్పన చేశారని చెప్పారు. మెదక్ లో రూ. 2 కోట్లతో షాదీఖానా నిర్మిస్తున్నామని.. త్వరలోనే ఇది పూర్తవుతుందన్నారు. షాదీ ముబారక్, షాదీ ఖానా ద్వారా మెదక్ లోని పేద ముస్లింలు తమ ఆడపిల్లల పెళ్లిళ్లను తక్కువ ఖర్చుతో చేయవచ్చన్నారు. ఈద్గా, మసీదు మరమ్మతులకు రూ. 2 కోట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అదే రీతిలో పేద మైనార్టీ విద్యార్థుల చదువు కోసం రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ పాఠశాల లను సీఎం ప్రారంభించారని చెప్పారు. మెదక్ లో ప్రస్తుతం ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాకుండా మరోకటి బాలికల కోసం మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు.