మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

ప్రజా చైతన్యంతోనే లక్ష్య సాధన

నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): మొక్కలు నాటడం సామాజిక బాద్తయగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యత ఆరోగ్యవంతమైన వాతావరణం భవిష్యత్‌ తరాలకు అందించేందుకు హరితహారం తోడ్పడుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత నిచ్చి రేపటి తరానికి ఆరోగ్యకరమైన వాతావరణం అందించి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు హరితహారాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం సీఎంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. హరితహారంలో ప్రజలను భాగస్వాములను చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయన్నారు. గత మూడేళ్లుగా హరితహారం కార్యక్రమం నిర్వహిస్తూ మొక్కలు నాటుతూ పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యత.. నాటడం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రజలు తమ అవసరంగా భావించి హరితహారంలో పాల్గొనాలన్నారు. మొక్కలు పెంచాలనే భావన ప్రజల్లో కలిగేలా చైతన్యం చేయాలన్నారు. మనిషి బతకడానికి ప్రాణవాయువు, మంచి ఆరోగ్యకర వాతావరణం కావాలన్నారు. కేవలం లక్ష్యంకోసం కాకుండా రేపటి తరం మంచి వాతావరణంలో, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భాగస్వాములు కావాలన్నారు. ఎక్కువకాలం జీవించే రావి, మర్రి, ఇతర అటవీ మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో సీసీరోడ్లు వేయడం కాదు… సీసీరోడ్లపై ఎండ పడకుండా మొక్కలు నాటాలన్నారు. వ్యవసాయ విస్తరణలో భాగంగా కంచె, పోడు భూములు సేద్యంలోకి రావడం వల్ల అటవీ శాతం తగ్గిపోయిందని, దీనిపై గత పాలకులు పెద్దగా శ్రద్ద పెట్టలేదన్నారు. వారి పాపాల వల్లే వర్షాలు కురువక కరువు దాపురిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశ పెడుతున్నారన్నారు. తెలంగాణకు హరితహారం దేశానికి దిక్చూచిగా మారాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది 137 నర్సరీలలో కోటి 68 లక్షలు పెంచి సిద్దం చేయగా మరో 32లక్షలు కొనుగోలు చేసి 2కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. నాటిన మొక్కలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.