మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్‌లదే: కలెక్టర్
మెదక్,డిసెంబర్14(జనం సాక్షి ): వచ్చే వర్షాకాలం వరకు హరితహారం మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలు తీసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. సర్పంచ్‌లు శ్రద్ద తీసుకుని వీటిని రక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. అప్పుడే నాటిన మొక్కలు బతుకుతాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు అందిస్తున్న విధానాన్ని, మొక్కల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఇదే విధంగా మొక్కలను వచ్చే వర్షాకాలం వరకు కాపాడాలని సూచించారు. మొక్కల పెంపకంతో అడవుల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆయన పలు ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అటవీ ప్రాంతమంత కలియదిరుగుతూ అధికారులకు సూచనలను, సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోతుల బారి నుంచి బయటపడాలంటే అడవుల్లో పండ్ల మొక్కలను పెంచాలన్నారు. అడవుల్లో పండ్లు దొరకక కోతులు గ్రామాల్లో సంచరిస్తున్నాయని పండ్ల మొక్కలను పెంచడం వలన అడవులకు తిరుగి వెళ్లిపోతాయి. అలాగే ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని అధికారులకు సూచించారు. నాటిన మొక్కలను కాపాడకపోతే సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలపై చర్యలు తప్పవని వెల్లడించారు. ప్టాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామస్తులు చెత్తను ఆరుబయట వేయకుండా చెత్త బుట్టలను వాడాలని తెలిపారు. చెత్తను ఆరుబయట వేయకుండా చెత్త బండిలోనే వేయాలని తెలియజేశారు.