మోగిన వరంగల్‌ ఉపఎన్నికల నగారా

2

నవంబర్‌ 21న వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక

వరంగల్‌,అక్టోబర్‌21(జనంసాక్షి): చాలా రోజులుగా ఎదురు చూస్తున్న లోక్‌ సభ ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 28వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్‌ జరుగనుంది. నామినేషన్‌ దాఖలుకు నవంబర్‌ 4వ తేదీ చివరి తేదీగా నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీగా నిర్ణయించారు. 21వ తేదీన ఉప ఎన్నిక జరుగనుంది. 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

వరంగల్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ బీహర్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు విడుదలౌతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించాయి. కానీ,వరంగల్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్‌ను సీఈసీ విడుదల చేయలేదు. గత కొన్ని రోజులుగా వరంగల్‌ ఉప ఎన్నిక కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు ఎంపీ సీటు దక్కకుండా చేయడానికి విపక్షాలు వ్యూహాలు రచించనున్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్‌ కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎన్నికల నగారా మోగడంతో రేపటి నుండి అధికార..విపక్షాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది.

ఎన్నికల షెడ్యూలు…

ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల తేదీ … ఈనెల 28

నామినేషన్‌ దాఖలుకు తుదిగడువు.. నవంబర్‌ 4

నామినేషన్ల పరిశీలన.. నవంబర్‌ 5

నామినేషన్ల ఉపసంహరణకు గడువు.. నవంబర్‌ 7

పోలింగ్‌ నిర్వహణ… నవంబర్‌ 21

ఓట్ల లెక్కింపు నవంబర్‌ 24