మోడీ హత్యకు కుట్ర వార్తలపై కాంగ్రెస అనుమానం

ఇదంతా ప్రజాదరణ తగ్గడంతోనే అన్న సంజయ్‌ నిరుపమ్‌

న్యూఢిల్లీ,జూన్‌8(జనం సాక్షి ): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ పుణె పోలీసులు వెల్లడించిన సంచలన వివరాలపై కాంగ్రెస్‌ శుక్రవారం అనుమానాలు వ్యక్తం చేసింది. మోదీ ప్రజాదరణ తగ్గుతోందని, దాంతో గతంలో పాటించిన కొత్త వ్యూహాలకు మళ్లీ తెరదీశారని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. ఇది పూర్తిగా అవాస్తవం కాకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మోదీ ఇలాంటి అస్త్రాలను సంధించేవారు. ఎప్పుడైతే ఆయన ప్రజాదరణ తగ్గడం మొదలైందో హత్యకు సంబంధించిన వార్తలు ప్రచారంలోకి వచ్చేవి. వీటిలో ఎంత వాస్తవముందో ఈసారి కచ్చితంగా దర్యాప్తు చేయాల్సిందే’ అని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పుణె పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో జనవరిలో జరిగిన భీమా-కోరేగావ్‌ ఘర్షణల కేసులో చేపట్టిన దర్యాప్తులో బయటపడ్డ లేఖలో ఇందుకు సంబంధించిన కీలక సమాచారం బయటపడిందని పోలీసులు తెలిపారు. దిల్లీకి చెందిన కార్యకర్త రోనా విల్సన్‌ ఇంట్లో సదరు లేఖ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. నిషేధిత సీపీఐ మావోయిస్ట్‌ దళిత్‌కు చెందిన అయిదుగురు కార్యకర్తలను పోలీసులు నిన్న అరెస్ట్‌ చేశారు. విచారణలో భాగంగా పలు విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. లేఖలో ఎం-4 రైఫిళ్ల కోసం రూ.8కోట్లు కావాలని, ‘రాజీవ్‌ గాంధీ తరహాలో మరో ఘటన’ అని ఉందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల పవార్‌ కోర్టుకు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మరో ఆత్మాహుతి దాడికి ప్రణాళిక వేసి ఉండొచ్చని ఉజ్వల పవార్‌ పేర్కొన్నారు.