మోత్కుపల్లి నమ్మకద్రోహి

టిఆర్‌ఎస్‌లో చేరేందుకే విమర్శలు: టిడిపి
నల్గొండ,మే31(జ‌నం సాక్షి): మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు నమ్మకద్రోహి అని జిల్లా టిడిపి నాయకులు విమర్శించారు. పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శలు చేయడం దారుణమని అన్నారు.  టీడీపీలో ఉన్నతమైన పదవులను అనుభవించి రాజ్యసభ సీటు దక్కలేదన్న అక్కసుతో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై అనాలోచిత వ్యాఖ్యలు చేస్తూ నమ్మక ద్రోహిగా మోత్కుపల్లి నర్సింహులు వ్యవహరిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సాథినేని శ్రీనివాసరావు అన్నారు.  తెలంగాణలో ప్రజాదరణ పొందుతున్న టీడీపీని అభాసుపాలు చేయాలనే దురుద్ధేశంతో కేసీఆర్‌ను పొగుడుతూ మోత్కుపల్లి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచనలో భాగంగానే టీడీపీపై నిందారోపణలు చేస్తూ మొసలి కన్నీరు పెట్టి కార్యకర్తలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్‌లో చేరదల్చుకుంటే ఇన్ని డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు. గతంలో పలువురు ముఖ్యనాయకులు టీడీపీని వీడి ఇతర పార్టీల్లో చేరడంలో మోత్కుపల్లి సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపించారు. విజయవాడలో జరిగిన జాతీయ మహానాడుకు తరలివచ్చి విజయవంతం చేసిన జిల్లా నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. అలాగే పార్టీకి ద్రోహం చేసిన మోత్కుపల్లికి తగినరీతిలో బుద్ది చెబుతామని అన్నారు.
—————